Site icon vidhaatha

YSRCP | హింసకు ప్రేరేపిస్తున్నారు.. చర్యలు తీసుకోండి: వైసీపీ

YSRCP | విధాత‌: ఇటీవల కొద్దిరోజులుగా లోకేష్ చేస్తున్న ప్రసంగాలు… ప్రకటనలు.. హెచ్చరికలు ఆయన్ను చిక్కుల్లోకి నెట్టేసేలా ఉన్నాయి. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్లకు అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తాం కాబట్టి మీరు పోరాడండి.. కొట్లాడండి అంటూ తెలుగుదేశం కార్యకర్తలకు లోకేష్ పిలుపునికిచ్చారు. దీనిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా భగ్గుమంది.

ఒక రాజకీయనాయకుడై ఉండి కార్యకర్తలను హింసవైపు నడిపిస్తారా? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరు బాధ్యులు ? ఇదేనా నాయకుడి తీరు. అయన తీరుతో కార్యకర్తలు రెచ్చిపోయి ప్రభుత్వం మీద, అధికారుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలమీద దాడులకు దిగితే ఎవరు నిలువరిస్తారు ? ఇలా హింసను ప్రేరేపించే లోకేష్ మీద, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

జిల్లాల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు ఆనాడు రెచ్చగొట్టినందునే తంబళ్లపల్లె, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని, ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారని దీనికి టిడిపి నాయకత్వమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

సమాజంలో శాంతియుత జీవనానికి విఘాతం కలిగించేలా లోకేష్ ప్రకటనలు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో అయన మీద కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు వెళుతున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు.

Exit mobile version