సాధారణంగా క్యూఆర్ కోడ్(QR Code)ను కంపెనీ వెబ్సైట్ కోసం, షాపులు, కాలేజీలు, ఆఖరికి విజిటింగ్ కార్డుగానూ వాడటబ చూసాం. కానీ, ఇక్కడ అది ఇంకోలా ఉపయోగించబడింది.
తమ కళ్లముందే కూతురు మరణించడం ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు? అది కూడా ఎదిగి వచ్చిన అమ్మాయిని, పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన వేళలో అకాల మరణం కబళిస్తే, ఆ దు:ఖం భరించలేము. కేరళలోని కొల్లం (Kollam district in Kerala)జిల్లాలో నివసించే రెజీ, మినీ(Reji, Mini) దంపతుల కుమార్తె, 22 ఏళ్ల అఖిల(Akhila)కు ఓ రోజు జ్వరం వచ్చింది. సరే.. అదే తగ్గిపోతుందిలే అని టాబ్లెట్ వేసుకుని పడుకున్న ఆ అమ్మాయి ఆరోగ్యం తెల్లారేసరికల్లా విషమించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అఖిల చనిపోయింది(Died with fever). ఇది ఆ దంపతులకు ఆశనిపాతంగా తగిలింది. నిన్న బాగానే ఉన్న చిట్టితల్లి ఇంతలోనే తమను, ఈ లోకాన్ని వదిలి వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. క్రమంగా అఖిల స్నేహితుల సాహచర్యంలో బాధను దిగమింగుకున్న ఆ తలిదండ్రులు రోజూ ఆ స్నేహితులు చెప్పే కూతురి విశేషాలు, విజయాలు, వేసిన జోకులు, చేసిన విడియోలు(photographs, videos, achievements, and social media links ) చూస్తూ, వింటూ మెల్లమెల్లగా బాధనుండి బయటపడుతూండగా, వారికి ఓ ఆలోచన వచ్చింది. తమ కూతురి జ్ఞాపకాలు, విశేషాలు నలుగురికి తెలిసేలా చేస్తే ఎల్లకాలం ఎంతోమంది మదిలో చెదరని జ్ఞాపకంగా ఉంటుందని తలపోసారు. అనుకున్న వెంటనే వారు అమ్మాయి పేరు మీద ఒక వెబ్సైట్(Website) తయారుచేసారు. దాన్లో అఖిలకు సంబంధించిన విషయాలు, విశేషాలు, ఫోటోలు, విడియోలు, జోకులు, సోషల్ మీడియా లింకులు అన్నీ పొందుపరిచారు. ఇక్కడే వారికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది.
తన కూతురి సమాధి ఫలకంపై తన వెబ్సైట్ వివరాలు తెలుపుతూ ఒక క్యూఆర్ కోడ్(QR code on Gravestone) పెడితే ఎలా ఉంటుందీ అని. వెంటనే సమాధి ఉన్న మార్ థోమా వలియపల్లి చర్చ్ (Mar Thoma Valiyapally Church) ప్రధానాధికారిని సంప్రదించారు. కానీ, వారి నిబంధనల మేరకు చనిపోయిన వారి పేరు, పుట్టిన, మరణించిన తేదీలను తప్ప వేరే వివరాలను సమాధి ఫలకంపై రాయడాన్ని అనుమతించరు. అయినా వారు పట్టువదలకుండా ఆ చర్చి ప్రాంతీయ కార్యాలయం(Mar Thoma Kottarakkara-Punalur diocese) లో సంప్రదించి ఆ ప్రాంతానికి అధిపతి అయిన బిషప్ అనుమతి సంపాదించారు. తమ కూతురి సమాధి ఫలకంపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఇప్పుడు ఆ సమాధి ఎందరినో ఆకర్షిస్తూ, సోషల్ మీడియాలో వైరల్గా మారింది(Got viral on Social Media).
అఖిల తల్లి మినీ మాట్లాడుతూ, తమ ఆశలను, కలలను చెరిపేస్తూ కూతురు డిసెంబర్ 2022లో తమకు దూరమైందని, ఆమె తమ ప్రాణమని, తను లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని వ్యాఖ్యానించింది. తన మొదటి సంవత్సరీకం(First death anniversay) సందర్భంగా 2023 డిసెంబర్లో తనకు అశ్రు నివాళిగా ఏదైనా చేయాలని అనిపించడంతో తన స్నేహితుడిచ్చిన ఓ అమూల్యమైన సలహా మేరకు ఓ వెబ్సైట్ రూపొందించి, అఖిల సమాధి ఫలకంపై దాని క్యూఆర్ కోడ్ను ముద్రించాలనే నిర్ణయానికొచ్చినట్లు మినీ తెలిపింది. ఆ వెబ్సైట్ను రాబోయే రోజుల్లో మరిన్ని అఖిల విశేషాలతో నింపుతామని ఆశాభావం వ్యక్తం చేసింది మినీ.
చర్చి ఫాదర్ రెవరెండ్ మామచన్(Rev P J Mamachan) మాట్లాడుతూ, తమ చర్చి నిబంధనల మేరకు ఇటువంటివి అనుమతించమనీ, కానీ అఖిల విషయంలోని సున్నితత్వం, భావోద్వేగాలను తన ప్రజలు అర్థం చేసుకున్నారని, వారి అభ్యర్థన మేరకు రెజీ, మినీలకు బిషప్ అనుమతి మంజూరు చేసినట్లు చెప్పారు.
ఏదేమైనా, తమ మధ్య భౌతికంగా లేకపోయినా, తమ కూతురు నలుగురి జ్ఞాపకాల్లో బతికుండడం కోరుకున్న ఆ తల్లిదండ్రుల ఆలోచన వారికి మనశ్శాంతిని ప్రసాదించింది.