Viral Buildings | భారతదేశంలో స్థలం విలువైనదిగా మారిపోతున్న వేళ, ఒక చిన్న స్థలంలో ఎత్తైన భవనం నిర్మించడమే కాదు, దాన్ని గోడలా కనిపించేలా రూపొందించడం మాత్రం అసాధారణం. కానీ బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఓ భవంతి ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది – ఎందుకంటే దాన్ని చూసినవారందరూ ఆశ్చర్యపడటమే కాదు, నవ్వుకుంటున్నారు కూడా. మరొకటి ముజఫర్‌పూర్‌లో – కేవలం ఆరు అడుగుల స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనం. ఈ విచిత్ర భవనాలు దేశంలోని పట్టణాభివృద్ధి, నిర్మాణ నియంత్రణలపై చర్చలకు కారణమయ్యాయి. మొదట ఖగారియాలోని భవనంపై వీడియో వైరల్ అయింది. ముందుగా చూస్తే అది సాధారణ ఇల్లు అనిపిస్తుంది. కానీ పక్కకు తిరిగి చూడగానే అసలైన ఆశ్చర్యం బయటపడుతుంది. ఇది కొన్ని అంగుళాల వెడల్పుతో ఉన్న ఎత్తైన భవనం. సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే ఇది కేవలం సిమెంటు గోడ లాగే కనిపిస్తుంది. ‘‘ఖగారియాలోని ఈ అద్భుత నిర్మాణం ఎక్కడ ఉంది?’’ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయగానే సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం మొదలైంది. ఇదిగో వీడియో..
बिहार के खगड़िया में गजब का अजूबा घर बना दिया है इसमें आदमी कैसे रहेगा 😂 pic.twitter.com/OaYrOnZcwA
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) July 1, 2025
కొంతమంది నెటిజన్లు దీన్ని ‘‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా – బిహార్ ఎడిషన్’’, ఇంకొందరు ‘‘ఇంట్లోకి వెళ్లాలంటే సైడుకు నడిచే స్టైల్ అవసరం’’ అంటూ సరదాగా స్పందించారు. ‘‘ఇది ఆర్కిటెక్చర్ కాదు, మాయజాలం!’’ అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. అయితే కొన్ని కామెంట్లు మాత్రం నిజాయితీగా ప్రశంసించాయి. ‘‘ఇది ఆశ్చర్యం కాదు, అవసరం నుంచి పుట్టిన ఆవిష్కరణ’’ అంటూ అభిప్రాయపడ్డారు.
ఈ హడావుడి ముంచుపడుతున్న వేళ ముజఫర్‌పూర్‌లోని గన్నిపూర్లో మరొక వింత భవనం వెలుగులోకి వచ్చింది. కేవలం ఆరు అడుగుల స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనం ఇది. స్థానికంగా దీన్ని ‘‘బిహార్ బుర్జ్ ఖలీఫా’’, ‘‘బిహార్ ఐఫిల్ టవర్’’ అని పిలుస్తున్నారు. ఇది ఎంత టైట్‌గా ఉందంటే పై అంతస్తులో నిలబడి చేతులు చాస్తే రెండు గోడలు అందుతాయి. అంత తక్కువ వెడల్పు ఉన్న నిర్మాణం ఇది. విడియో చూడండి.
ఈ రెండు భవనాలను చూసిన సామాన్య ప్రజలు మాత్రమే కాదు, పట్టణ ప్రణాళిక నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఇది ఆవిష్కరణా? లేక నిబంధనలకి విరుద్ధమైన నిర్మాణమా?’’ అనే చర్చ ప్రారంభమైంది. కొందరు నిపుణులు ఈ నిర్మాణాలు స్థల కొరతతో పోరాడుతున్న పేద, మధ్యతరగతి వర్గాల ఆవిష్కరణగా చూస్తున్నా, మరికొందరు మాత్రం నియంత్రణల లేమితో పుట్టిన అపరిపక్వ నిర్మాణాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ భవనాలకు సరైన భద్రతా ప్రమాణాలు, నిర్మాణ అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం – ఇవి దేశవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించాయి. ఇవి ఆర్కిటెక్చర్‌లో కొత్త మార్గాలను చూపించాయా? లేక శ్రద్ధ లేని పట్టణాభివృద్ధికి నిదర్శనమా? అన్నది పరిశీలించాల్సిన అంశం. భద్రత విషయంలోనూ ఈ భవంతులు ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయి.