Afsana Pawar Next Mona Lisa | నెట్టింట మరో ‘మోనాలిసా’.. వీడియో వైరల్‌

సామాజిక మాధ్యమాలు ఊపందుకున్న తర్వాత చిన్న చిన్న సెన్సేషన్లు.. దేశం మొత్తం సంచలనం రేపుతున్నాయి. మహా కుంభ మేళాలో మోనాలిసా అనే యువతి దేశం దృష్టిని ఆకర్షించగా.. తాజాగా అదే ప్రయాగ్‌ రాజ్‌లో అఫ్సానా పవార్‌ అనే యువతి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Afsana Pawar Next Mona Lisa | మోనాలిసా గుర్తుందా? లియొనార్డో డావించీ గీసిన అద్భుత చిత్రం గురించి కాదు.. మొన్నా మధ్య ఉత్తరప్రదేశ్‌లో మహాకుంభ మేళా సమయంలో రాత్రికి రాత్రే స్టార్‌ సెన్సేషన్‌ అయిపోయిన నీలి కళ్ల మొనాలిసా!! కుంభమేళాలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది ఈ పూసలమ్మే అమ్మాయి! ఒక యూట్యూబర్‌ కెమెరాకు చిక్కి.. దేశంలో సంచలనం రేపింది. ఒక దశలో సినీ ఆఫర్లు సైతం ఆమెకు వచ్చాయి. సరే.. ఈ అమ్మాయి విషయాన్ని కాసేపు పక్కకు పెడితే.. ఇప్పుడు తాజాగా మరో మోనాలిసా నెట్టింట హల్చల్‌ చేస్తున్నది. విశేషం ఏమిటంటే.. ఈమె కూడా ప్రయాగ్‌రాజ్‌ నుంచే ఆన్‌లైన్‌లో సంచలనం రేపుతున్నది.

ఈ అమ్మడి పేరు అఫ్సానా పవార్‌. మాఘ మేళాతో ఈమె పాపులర్‌ అయింది. అఫ్సానాకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అటువంటి ఒకానొక వీడియోలో ఆ వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి.. అఫ్సానాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె పేరు, ఇతర వివరాలు అడుగుతూ ఉంటాడు. తన పేరును చెబుతూ పరిచయం చేసుకున్న అఫ్సానా.. తాను వేర్వేరు మేళాలకు వెళుతూ ఉంటానని, అక్కడ పూల దండలు అమ్ముతుంటానని వెల్లడించింది. అదే వీడియోలో ఆమె బంధువులు పక్కన కూర్చొని ఉండటం గమనించవచ్చు.

కుంభమేళాలో సంచలనం రేపిన మోనాలిసా తరహాలో మీరు కూడా సినిమాల్లోకి వెళతారా? అన్న ప్రశ్నకు.. ఆమె, ఆమె పక్కన కూర్చొన్నవారు కూడా ‘ఫేమస్‌ అయి.. అవకాశాలు వస్తే బాగుండు’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వీడియోను ఎక్స్‌లో చూసిన కొందరు యూజర్లు.. అఫ్సానా.. మోనాలిసాకు బంధువేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. అఫ్సానా మాత్రం ఆ విషయాలేవీ ధృవీకరించలేదు. అయితే.. నెటిజన్లు మాత్రం మోనాలిసా కళ్లు, అఫ్సానా కళ్లు ఒకేలా ఉన్నాయని పోల్చి చెబుతున్నారు. ఆ కళ్లే మోనాలిసాను కుంభమేళాలో సంచలనంగా మార్చాయి. ఇప్పుడు అవే కళ్లు మాఘ మేళాలో కొత్త సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయని పేర్కొంటున్నారు.

ఇదే ఆ వీడియో..

Latest News