Sleepless Nights | అర్ధరాత్రి నిద్ర లేస్తున్నారా.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే రాత్రంతా ప్రశాంతంగా పడుకోవచ్చు!

Sleepless Nights | ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి(Insomnia). ఈ సమస్య నుంచి బయటపడి రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Sleepless Nights | ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి(Insomnia). రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం.. ఒకవేళ పడుకున్నా అర్ధరాత్రి కాగానే మెలకువ రావడం.. ఆ తర్వాత ఎంతసేపటికీ నిద్ర రాకపోవడం వంటి సమస్యలతో చాలామంది సతమతమవుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడి రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి భోజనం

కొంతమంది రాత్రి సమయాల్లో ఎక్కువగా తినేస్తుంటారు. మరికొందరేమో డైట్ పేరుతో అస్సలు తినరు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అతిగా తింటే జీర్ణ సమస్యలు, తినకపోతే శరీరానికి కావాల్సిన శక్తి అందక నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా మధ్య రాత్రిలో మెలుకువ వస్తుంది. ఆ తర్వాత మళ్లీ త్వరగా నిద్రపట్టదు. ఫలితంగా మరుసటి రోజు అలసట, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే రాత్రి సమయాల్లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

రాత్రి వేళలో టీ, కాఫీలు తాగొద్దు

చాలామందికి రాత్రి భోజనం తర్వాత టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నిద్రపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కెఫిన్ తీసుకున్నాక చాలా సేపటి వరకు నిద్ర రాదు. అందుకే పడుకోవడానికి కనీసం ఐదారు గంటల ముందు నుంచి కెఫిన్ తీసుకోవడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పగటి నిద్ర

ఇంట్లోనే ఉండేవారు మధ్యాహ్న సమయంలో ఒక కునుకు వేస్తారు. కొంతమంది అయితే రెండు మూడు గంటల పాటు నిద్రపోతారు. అలా గంటల తరబడి పడుకుంటే.. రాత్రి సమయాల్లో నిద్ర పట్టడం కష్టమవుతుంది. కాబట్టి పగటి పూట అరగంటకు ఎక్కువ పడుకోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

రాత్రి మొబైల్ వాడకం తగ్గించాలి

చాలామందికి పడుకునే ముందు మొబైల్స్‌లో రీల్స్, షార్ట్స్ చూడటం లేదా టీవీలో థ్రిల్లర్ సినిమాలు చూడటం అలవాటు. అలాంటి థ్రిల్లర్ లేదా హారర్ సినిమాలు చూసినప్పుడు మనసులో భయం, ఆందోళనలు పెరుగుతాయి. అర్ధరాత్రి మెలుకువ వచ్చినప్పుడు ఆ సినిమాలోని సన్నివేశాలు గుర్తొచ్చి మళ్లీ నిద్రపట్టకపోవచ్చు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఉండాలి. అవసరమైతే సాఫ్ట్ మ్యూజిక్ వినడం లేదా పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పడుకునే చోటూ ముఖ్యమే

రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టాలంటే మనం పడుకునే చోట వాతావరణం కూడా బాగుండాలి. గది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండాలి. ఫోన్ నోటిఫికేషన్లు, పెద్ద శబ్ధాలు నిద్రకు భంగం కలిస్తాయి. కాబట్టి రాత్రి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్‌గా రొటీన్ షెడ్యూల్ పాటించడం వల్ల శరీరానికి ఒక నియమం అలవాటు అవుతుంది. దీన్ని స్లీప్ హైజిన్ అంటారు. ఇది నిద్రకు చాలా మంచిది.

Read More:

Latest News