రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలి.. అందుకు పార్లమెంటు చట్టం చేయాలి: కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ డిమాండ్‌

రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50శాతం పరిమితిని ఎత్తివేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్లమెంటు చట్టం చేయాలని కోరింది.

  • Publish Date - June 30, 2024 / 04:44 PM IST

న్యూఢిల్లీ : రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50శాతం పరిమితిని ఎత్తివేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్లమెంటు చట్టం చేయాలని కోరింది. ఎన్డీయే కీలక భాగస్వామ్యపక్షాల్లో ఒకటైన జేడీయూ బీహార్‌లో రిజర్వేషన్‌ కోటా పెంపుదలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేసిన మరుసటి రోజు కాంగ్రెస్‌ రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని కోరడం గమనార్హం.ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్‌ కోటాను 50 శాతం నుంచి 65శాతానికి పెంచుతూ బీహార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల పక్కనపెట్టడంపై శనివారం నిర్వహించిన జనతాదళ్‌ (యూ) నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన జేడీయూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని న్యాయ సమీక్షకు వీలు లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో ఆదివారం ఎక్స్‌ వేదికగా స్పందించిన కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌.. 1994లో తమిళనాడు కేసులో చేసినట్టుగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి చేసిన చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

‘శనివారం పాట్నాలో జేడీయూ ఇదే తరహా డిమాండ్‌ చేయడం శుభ పరిణామం. కానీ.. రాష్ట్రంలో, కేంద్రంలో జేడీయూకు భాగస్వామిగా ఉన్న పార్టీ ఈ అంశంలో మౌనం పాటిస్తున్నది’ అని పేర్కొన్నారు.‘50శాతానికిపైగా రిజర్వేషన్లు కల్పించిన చట్టాలను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడమే పరిష్కారం కాదు. అటువంటి చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలో ఉండకూడదు. అందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన పార్లమెంటు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇప్పుడున్న 50శాతం పరిమితి రాజ్యాంగంలో ఉన్నదేమీ కాదని, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు నిర్ణయాల మేరకే ఏర్పాటు చేసిందేనని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఈ గ్యారెంటీ ఇచ్చిందని, అది అలానే ఉంటుందని జైరాం రమేశ్‌ చెప్పారు. ‘దేవదూతనని చెప్పుకొనే ప్రధాన మంత్రి ఆయన వైఖరిని వెల్లడిస్తారా? అటువంటి బిల్లును పార్లమెంటు తదుపరి సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనేది మా డిమాండ్‌. జేడీయూ తీర్మానాలు చేయడానికే పరిమితం కాకుడదు.’ అని పేర్కొన్నారు.

Latest News