Telangana | తెలంగాణ రాజ‌కీయాల్లో ‘బీసీ’ ర‌గ‌డ‌

Telangana జ‌నాభాలో స‌గం..ప‌ద‌వుల్లో ఆగం అంటున్న బీసీ నేత‌లు కోటా మేర‌కు అసెంబ్లీ సీట్లు అంటూ డిమాండ్‌ తెలంగాణ‌లో 40 మంది ఎమ్మెల్యేలతో రెడ్డి వర్గం ఆధిక్యం ఆ తర్వాతి స్థానంలో బీసీలు విధాత‌:  తెలంగాణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీల్లో బీసీ నినాదం చిచ్చు మొద‌లైంది. జ‌నాభాలో స‌గం ఉన్న బీసీల‌కు రాజ‌కీయ ప‌ద‌వుల్లో ద‌క్కుతున్న ప్రాధాన్య‌త త‌క్కువే అంటూ ఆయా పార్టీల నేత‌లే గొంతెత్తుతున్న ప‌రిస్థితి నెల‌కొంది. బీసీల ఓట్లు రాబ‌ట్టేందుకు కేసీఆర్ […]

  • Publish Date - July 20, 2023 / 12:35 AM IST

Telangana

  • జ‌నాభాలో స‌గం..ప‌ద‌వుల్లో ఆగం అంటున్న బీసీ నేత‌లు
  • కోటా మేర‌కు అసెంబ్లీ సీట్లు అంటూ డిమాండ్‌
  • తెలంగాణ‌లో 40 మంది ఎమ్మెల్యేలతో రెడ్డి వర్గం ఆధిక్యం
  • ఆ తర్వాతి స్థానంలో బీసీలు

విధాత‌: తెలంగాణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీల్లో బీసీ నినాదం చిచ్చు మొద‌లైంది. జ‌నాభాలో స‌గం ఉన్న బీసీల‌కు రాజ‌కీయ ప‌ద‌వుల్లో ద‌క్కుతున్న ప్రాధాన్య‌త త‌క్కువే అంటూ ఆయా పార్టీల నేత‌లే గొంతెత్తుతున్న ప‌రిస్థితి నెల‌కొంది. బీసీల ఓట్లు రాబ‌ట్టేందుకు కేసీఆర్ ఇటీవ‌ల ప్ర‌తి బీసీ కుటుంబానికి ల‌క్ష రూపాయ‌ల సాయం అంటూ ప్ర‌క‌టించారు. దీంతో కాంగ్రెస్‌లో బీసీ నినాదం రాజుకుంది. తెలంగాణ‌ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ రోడ్డెక్కారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లు బీసీల‌కు కేటాయించాల‌న్న డిమాండ్‌తో ఇటీవ‌ల మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో కాంగ్రెస్ నేత‌లు స‌మావేశ‌మ‌వ‌డంతో ఈ డిమాండ్ గ‌ట్టిగా తెర‌పైకి వ‌చ్చింది.బీసీలు సీట్లు అడగకుండా కాంగ్రెస్‌పార్టీలో సీట్లు వ‌చ్చేది లేదని పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయ‌ప‌డ‌ట‌మేకాదు, పార్టీ నాయకత్వం ఒక వర్గం చేతిలో ఉందని ప‌రోక్షంగా రెడ్డి వ‌ర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు స‌రికొత్త వివాదానికి దారి తీశాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి గ్రౌండ్ లెవెల్లో పని చేసేది బీసీ నేతలైతే, అగ్ర‌వ‌ర్ణాల నాయ‌కులు మాత్రం ప‌ద‌వుల్లో ఉంటారంటూ బీసీ నాయ‌కులు ఘాటుగానే వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తమ ఫిర్యాదులు, డిమాండ్లపై స్పందించకుంటే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కూడా పొన్నాల అల్టిమేటం జారీ చేశారు. మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు వీ. హ‌నుమంత‌రావుతో స‌హా ప‌లువురు కాంగ్రెస్ బీసీ నేత‌లు లక్ష్మయ్యతో ఏకీభవించారు.

బీసీల డిమాండ్లను పట్టించుకోకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందని వీ హనుమంతరావు అన్నారు. ఇప్పుడు మరికొందరు బీసీ నేతలు తోడయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీసీ నేతలకు 45 సీట్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే తామేంటో నిరూపిస్తామని అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బీసీ నేతలు బీసీలకు ప్రాధాన్యం దక్కక‌పోవ‌డంపై అటోఇటో తేల్చుకోవాలని నిర్ణ‌యించుకున్నారు.

తెలంగాణ‌లో ఏ వ‌ర్గాల‌ వారు ఎంద‌రు?

ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన వివిధ పార్టీల ఎమ్మెల్యేల జాబితాను ప‌రిశీలిస్తే, 2018 ఎన్నిక‌ల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం నుంచి అత్య‌ధికంగా 40 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌య్యారు. ఆ తరువాత స్థానంలో బీసీ వ‌ర్గాల నుండి 22 మంది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు,
షెడ్యూల్డ్ కులాల నుండి 19 మంది, షెడ్యూల్డ్ తెగ నుండి 12 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్‌రావు (వెల‌మ‌) కులానికి చెందిన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు.

2014 ఎన్నికలతో పోలిస్తే 2018లో రెడ్డి వ‌ర్గం నుంచి ఇద్ద‌రు త‌గ్గారు. బీసీ వ‌ర్గాల నుంచి కూడా రెండు సీట్లు త‌గ్గాయి. ఎన్నికైన 40 మంది రెడ్డి ఎమ్మెల్యేలలో 31 మంది బీఆర్‌ఎస్ నుంచి, తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఎనిమిది మంది ముస్లింలు, ఐదుగురు కమ్మ సామాజికవర్గం, ఇద్దరు బ్రాహ్మణులు, ఒక స్థానం నుంచి వైశ్యులు ఎన్నికయ్యారు. పద్దెనిమిది మంది బీసీలు బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. యాదవ, గౌడ్, మున్నూరు కాపు కులాలకు చెందిన బీసీలు అత్యధికంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎస్టీలలో ఆదివాసీల కంటే లంబాడాలు ఎక్కువగా ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో మండల కమిటీల రచ్చతో గాంధీభవన్‌లో మూడు రోజులుగా ధర్నాలతో వేడెక్కిన సంద‌ర్భంలోనే ఆ పార్టీకి చెందిన బీసీ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌లం పెరుగుతోంద‌న్న స‌ర్వేల నేప‌థ్యంలో బీసీ నేతల వివాదం రోజురోజుకు ముదురుతుండడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది.

Latest News