Newborn’s Body | అంబులెన్స్‌లు( Ambulance ) అందుబాటులో లేకపోవడం.. సమయానికి వైద్యం( Treatment ) అందకపోవడం.. ఓ పసికందు( Newborn baby ) తల్లి కడుపులోనే కన్నుమూసింది. కన్నుమూసిన ఆ బిడ్డను తరలించేందుకు కూడా అంబులెన్స్ లేకపోవడంతో.. ఆ నిరుపేద తండ్రి( Father ).. రూ. 20 క్యారీ బ్యాగ్( Carry Bag )లో 90 కి.మీ. పసిబిడ్డ మృతదేహాన్ని( Newborn Body ) మోసుకెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్ర( Maharashtra )లోని నాసిక్( Nashik )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని జోగల్వాడి గ్రామానికి చెందిన దంపతులిద్దరూ ఇటుక బట్టీల్లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కట్కారి గిరిజన తెగకు చెందిన వీరికి ఇద్దరు పిల్లలు కాగా, మరోసారి గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండడంతో ఇటీవల థానే జిల్లాలోని ఇటుక బట్టీల నుంచి ఆసే గ్రామానికి చేరుకున్నారు.
జూన్ 11న ఆమెకు నొప్పులు రావడంతో.. ఆశా వర్కర్‌ను సంప్రదించారు. ఆమె 108 అంబులెన్స్‌కు కాల్ చేయగా స్పందన లేదు. దీంతో ఓ ప్రయివేటు వెహికల్‌లో ఖోదలా పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికీ తన కడుపులో బిడ్డ కదలిక ఉంది. పరిస్థితి విషమంగా ఉందని చెప్పి మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ హార్ట్ బీట్‌లో ఎలాంటి స్పందన లేకపోవడంతో నాసిక్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. జూన్ 12న అర్ధరాత్రి 1.30 గంటలకు గర్భిణిని పరిశీలించగా, అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బిడ్డను బయటకు తీశారు. ఇక తమ సొంతూరికి పసికందును తీసుకెళ్తామని, అంబులెన్స్‌ను సమకూర్చాలని ప్రభుత్వ వైద్యులను కోరగా, వారు అందుకు నిరాకరించారు.
చేసేదేమీ లేక అక్కడనే రూ. 20 క్యారీ బ్యాగ్‌ను తండ్రి కొనుగోలు చేశాడు. అనంతరం బిడ్డను ఓ బట్టలో చుట్టి క్యారీ బ్యాగ్‌లో పెట్టేశాడు. అంబులెన్స్ లేకపోవడంతో.. వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఇక 90 కిలోమీటర్లు ప్రయాణించి.. పసికందు మృతదేహంతో సొంతూరుకు చేరుకున్నాడు. పసిగుడ్డును ఖననం చేసి తిరిగి తన భార్య చికిత్స పొందుతున్న నాసిక్ ఆస్పత్రికి చేరుకున్నాడు. భార్యను తరలించేందుకు అంబులెన్స్ కావాలని కోరగా, మళ్లీ తిరస్కరించారు. చేసేదేమీ లేక ఆమె కూడా బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యవస్థపై దంపతులిద్దరూ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.