Site icon vidhaatha

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశ … బెయిల్ పిటిషన్ విచారణ 17కు వాయిదా

విధాత, హైదరాబాద్ : ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో సీఎం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో మార్చి నెలలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. అదే నెల 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. మధ్యంతర స్టేను సవాల్‌ చేయగా.. హైకోర్టు తోసిపుచ్చింది. ఇక జూన్ 29న కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్‌ జైలులో ఉన్న ఆయనను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా స్పెషల్‌ జడ్జి కావేరీ బవేజా సమక్షంలో బుధవారం హాజరుపరిచారు. ఆయన జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 12 వరకు పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.

Exit mobile version