Site icon vidhaatha

Indian student | అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఏడాదిలో ఇది పదో మరణం, నెలలో నాలుగోది..!

Indian student : అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. కేవలం ఏడాది వ్యవధిలోనే భారత్‌కు చెందిన 10 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారు. మరీ విచిత్రంగా గడిచిన నెల రోజుల వ్యవధిలోనే నలుగురు భారతీయ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ వరుస మరణాలు తమ పిల్లలను చదువు కోసం అమెరికాకు పంపుతున్న తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మరో విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు.

అమెరికాలోని ఓహియో రాష్ట్రం క్లీవ్‌లాండ్‌లో గద్దె ఉమా సత్యసాయి అనే తెలుగు విద్యార్థి మరణించాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. భారత విద్యార్థి మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.

అయితే మరణించిన గద్దె ఉమా సత్యసాయి స్వస్థలంతోపాటు ఇతర వివరాలు తెలియాల్సి ఉందని భారత రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఉమా సత్యసాయి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. సత్యసాయి మరణంతో కలిపి ఈ ఏడాదిలో అమెరికాలో పదిమంది భారత విద్యార్థులు మరణించినట్లయ్యింది.

ఈ పది మరణాల్లో ఇండియానాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం విద్యార్థి నీల్‌ ఆచార్య, జార్జియాలో వివేక్‌ సైనీ హత్య ఘటనలు యావత్‌ భారతదేశాన్ని నివ్వెరపోయేలా చేశాయి. అంతేగాక ఈ మధ్య కాలంలో అమెరికాలో భారత విద్యార్థులపై దాడులకు సంబంధించిన ఘటనలు కూడా ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి.

Exit mobile version