Site icon vidhaatha

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి హత్య

భారతీయ విద్యార్థుల మధ్య ఘర్షణ
నివారించే యత్నంలో కత్తిపోట్లు
మరో విద్యార్థికి గాయాలు

కర్నాల్‌: ఆస్ట్రేలియాలో కొందరు భారతీయ విద్యార్థుల మధ్య ఘర్షణలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల ఎంటెక్‌ విద్యార్థి చనిపోయాడు. ఈ ఘటన మెల్‌బోర్న్‌లో శనివారం రాత్రి 9 గంటలకు (ఆస్ట్రేలియా కాలమానం) చోటు చేసుకుందని మృతుని బంధువులు తెలిపారు. ఇదే ఘర్షణలో మరో విద్యార్థి కూడా గాయపడ్డాడని చెప్పారు.

ఇంటి అద్దె విషయంలో కొందరు భారతీయ విద్యార్థుల మధ్య ఘర్షణను నివారించేందుకు నవ్‌జీత్‌ సంధు ప్రయత్నించిన సమయంలో మరో విద్యార్థి అతడిపై కత్తితో దాడి చేశాడని మృతుని బంధువు యశ్వీర్‌ చెప్పారు. నవ్‌జీత్‌కు కారు ఉండటంతో తన సామాన్లు తీసుకుని వచ్చేందుకు సహకరించాలని కోరాడని ఆయన తెలిపారు. తన స్నేహితుడు లోపలికి వెళ్లిన తర్వాత కాసేపటికి అరుపులు కేకలు వినిపించాయని చెప్పారు.

లోపలికి వెళ్లి, గొడవ పెట్టుకోవద్దని చెప్పేందుకు ప్రయత్నించిన నవ్‌జీత్‌పై ఒక భారతీయ విద్యార్థి కత్తితో ఛాతీపై పొడిచాడని తెలిపారు. దాడి చేసిన విద్యార్థి కూడా కర్ణాల్‌కు చెందినవాడేనని యశ్వీర్‌ తెలిపారు. ఆదివారం ఉదయం తమకు ఈ సమాచారం అందిందని ఆయన చెప్పారు. నవ్‌జీత్‌ స్నేహితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయని తెలిపారు. నవ్‌జీత్‌ తెలివైన విద్యార్థి అని, జూలై నెలలో సెలవుల నిమిత్తం సొంతూరికి రావాల్సి ఉన్నదని చెప్పారు.

విద్యార్థి వీసాపై నవ్‌జీత్‌ ఏడాదిన్నర క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడని యశ్వీర్‌ తెలిపారు. రైతు అయిన ఆయన తండ్రి తనకున్న ఎకరంన్నర భూమిని అమ్మి నవ్‌జీత్‌ను ఆస్ట్రేలియాకు పంపారని పేర్కొన్నారు. నవ్‌జీత్‌ భౌతిక కాయాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు సహకరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version