Site icon vidhaatha

One Nation, One Election । జమిలిపై బీజేపీకి ఎందుకు అంత ఆసక్తి? ప్రతిపక్షాల వ్యతిరేకత ఎందుకు?

One Nation, One Election । 2014 నుంచి మోదీ చెబుతున్న ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అమల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ మేరకు కీలకమైన రెండు బిల్లులను గురువారం కేంద్రం క్యాబినెట్‌ ఆమోదించింది. ఇక సంయుక్త పార్లమెంటరీ కమిటీలో సంప్రదింపులు, పార్లమెంటు లోపల, బయట చర్చోపచర్చల అనంతరం అది వాస్తవరూపం దాల్చాల్సి ఉన్నది. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించాలని బుధవారం మాజీ రాష్ట్రపతి, జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీకి సారథ్యం వహించిన రాంనాథ్‌ కోవింద్‌ చెప్పారు. అయినా.. ఈ విషయంలో బీజేపీ ఏకపక్షంగానే వ్యవహరిస్తుందనేది నిర్వివాదాంశం.

జమిలి ఎన్నికల అంశం గతంలో అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు లా కమిషన్‌, పార్లమెంటరీ కమిటీలు సైతం ఈ ప్రతిపాదనపై చర్చించాయి. ఈ అంశాన్ని బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. అయితే.. ఈ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడం అనేది మాత్రం అంతుచిక్కని అంశంగా మిగిలిపోయింది. చాలా కాలంగా బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తుతూ వచ్చింది. ఆ పార్టీ సీనియర్‌ నేతలైన అద్వానీ వంటివారు సైతం జమిలి ఎన్నికలను సమర్థించారు. అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాలనేది కూడా బీజేపీ వాదన. బీజేపీ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, జేడీఎస్‌, శిరోమణి అకాలీ దళ్‌, బీజేడీ వంటి పార్టీలు కూడా బీజేపీ అజెండాను బలపరుస్తున్నాయి.

ప్రస్తుత ఎన్నికల విధానంలో దేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎన్నిక జరుతూనే ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీలు, స్థానిక సంస్థలు, రాష్ట్ర అసెంబ్లీలు, సాధారణ ఎన్నికలకు ఏడాదిలో రెండు మూడొందల రోజులు పోతున్నాయని అంటున్నాయి. దీర్ఘకాలం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని వాదిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుండటంతో పాలన కూడా సక్రమంగా సాగడం లేదనేది వారి అభిప్రాయం.

జమిలి ఎన్నికలను ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. జమిలి ఎన్నికలపై రాంనాథ్‌ కోవింద్‌ నాయకత్వాన కమిటీలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి కూడా సభ్యుడు. అయితే.. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై సిఫారసులు చేయడం కాకుండా.. దాని అమలుకు కమిటీ మార్గాలు సూచించాలనడంతో ఆ కమిటీ నుంచి అధిర్‌ రంజన్‌ చౌదరి తప్పుకొన్నారు. ప్రతిపక్ష టీఎంసీ, డీఎంకే, ఆప్‌ వంటి పార్టీలు కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ, స్థానిక ఆకాంక్షలు అణచివేతకు గురవుతాయనేది ప్రతిపక్షాల ప్రధాన వాదన. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయంగా ప్రాధాన్యం ఉన్న అంశాలు పక్కకు పోయి.. జాతీయ అంశాలు ప్రధానాంశంగా ముందుకు వచ్చి కూర్చుంటాయనే వాదన ఉన్నది. ఫలితంగా చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు తమ ఆలోచనలను దేశ ప్రజల ముందు ఉంచడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

Exit mobile version