Bengaluru Techie | సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. కార్పొరేట్ కంపెనీలో జాబ్.. ఆరు అంకెల జీతం.. చాలామంది కలల లైఫ్ ఇది. సాధారణంగా ఇవన్నీ ఉంటే జీవితంలో స్థిరపడిపోయినట్లే అని అనుకుంటారు. కానీ పెరుగుతున్న జీవన వ్యయాలు, కుటుంబ బాధ్యతలు మెట్రో సిటీల ఖర్చులు ఆ భావనను మార్చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చిల్లర ఖర్చుల కోసం పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తుండటం ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
వీకెండ్‌లో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథను షాబాజ్ అనే వ్యక్తి ఇటీవల ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నాడు. బెంగళూరులోని బన్నెరఘట్ట ప్రాంతానికి వెళ్లేందుకు షాబాజ్ ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ఆ సమయంలో ర్యాపిడో డ్రైవర్ కన్నడలో మాట్లాడాడు. అయితే అతనికి భాష సరిగ్గా అర్థం చేసుకున్న ర్యాపిడో డ్రైవర్.. ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడటం చూసి అతని గురించి షాబాజ్ ఆరా తీశాడు. అప్పుడే అతను ప్రముఖ టెక్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడని. నెలకు ఆరు అంకెల జీతం కూడా వస్తుందని తెలుసుకున్నాడు. ‘నాకు పెళ్లయ్యింది. ఒక బిడ్డ ఉన్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు అదనపు ఆదాయం కోసం ఇలా వీకెండ్‌లో ర్యాపిడో నడుపుతున్నాను‘ అని ర్యాపిడో డ్రైవర్ చెప్పడంతో షాబాజ్ షాకయ్యాడు.
Today, while traveling to Bannerghatta, I booked a Rapido.
The rider, a 35-year old, started speaking in Kannada, realized mine wasn’t great, and switched to English. He asked what I do, and I told him I’m a software engineer.
Then he told me he’s also a software developer at… pic.twitter.com/wCfgB6Vb8D
— Shabaz (@Shabaz1406) June 6, 2026
ఈ సంఘటన చూసిన తర్వాత మంచి జీతాలు తీసుకునే టెక్ నిపుణులు కూడా బెంగళూరు, ఇతర ప్రధాన నగరాల్లోని జీవన వ్యయాలు భరించడానికి ఇబ్బంది పడుతున్నారేమోనన్న సందేహం కలిగిందని షాబాజ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. అది కాస్త వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో ఇలా రెండు ఉద్యోగాలు చేస్తే తప్ప బతకడం కష్టమని కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం మరో కోణాన్ని చెబుతున్నారు. కేవలం డబ్బు కోసమే కాకుండా.. సామాజిక అనుభవాలు పొందడం, ఉద్యోగ ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలామంది గిగ్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
