Bihar Voter List Irregularities | ఓటరు జాబితాల రూపకల్పనలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ఇంటి అడ్రస్‌తో వందల మంది ఓటర్లుగా నమోదన తీరు, నకిలీ ఓట్లు, ఒకే పేరుతో అనేక చోట్ల ఓట్లు ఉండటం, సరైన చిరునామాలు లేకపోవడం వంటి ఉదాహరణలతో ఇటీవల రాహుల్‌గాంధీ మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీహార్‌లో ఎన్నికలకు ముందే ఇటువంటి అవకతవకలు వెలుగు చూశాయి. బీహార్‌లోని దాదాపు 8 కోట్ల మంది ఓటర్ల అర్హతల తనిఖీ పేరిట ఇటీవల ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. అందులోనూ భారీ స్థాయిలో లొసుగులు బయటపడటం ఈసీ పనితీరుపై మరోసారి సందేహాలను లేవనెత్తుతున్నది. ఈ మేరకు ఒక పలువురు జర్నలిస్టులు ముసాయిదా ఓటరు జాబితాలను అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఐదు నియోజకవర్గాల్లో 12 వందల నుంచి 13 వందల క్లస్టర్లలోని సుమారు 1,50,00 ఓటర్లను తనిఖీ చేస్తే విస్మయం కలిగించే విషయాలు బయటపడ్డాయి. అసాధారణంగా అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న 14 ప్రాంతాలు ఈ తనిఖీల సందర్భంగా కనిపించాయి. ఇక్కడ ఒక్కో ఇంటి అడ్రస్‌తో కొన్ని చోట్ల డజన్ల సంఖ్యలో ఓటర్లు ఉంటే.. మరికొన్నింటిలో వందల్లోనే పేర్లు నమోదయ్యాయి. వాటిపై సదరు ఇండ్ల వారిని విచారించగా.. చాలా మంది వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు తేలింది. కొంతమంది ఎవరో కూడా తమకు తెలియదని చెప్పారు. కొన్ని కేసులలో చిన్నచిన్న ఇళ్ల అడ్రస్‌తో వంద ఓటర్లు నమోదయ్యారు. ఈ విషయం కూడా తమకు తెలియదని సదరు ఇంటిలో ఉంటున్నవారు చెబుతుండటం గమనార్హం. ఇంటింటి తనిఖీలు చేసి, ముసాయిదా ఓటరు జాబితాను తయారు చేయడంలో ఈసీ ఘోరంగా విఫలమైందని ఈ అవకతవకలు తేల్చి చెబుతున్నాయి. సవరణ తర్వాత కూడా ఇన్ని అవకతవకలు ఉన్నాయంటే వాటిని ఎన్నికల అధికారులు చూసీ చూడనట్టు వదిలేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్ణియా జిల్లాలోని రెండు ఇంటి చిరునామాలు రెండూ బూత్ నంబర్ 12లోని ఇంటి నంబర్ 2గా పేర్కొన్నారు. ఈ రెండు రెండింటిలో 22 మంది, 153 మంది ఓటర్లు ఉన్నట్టు ముసాయిదా ఓటరు జాబితా పేర్కొంటున్నది. అందులో 153 మంది ఓటర్లు ఉన్నద చిరునామా ఒక ప్రైవేట్ ప్లాట్‌లో నిర్మించిన ఆలయం పేరిట ఉన్నది. ఈ ఆలయం ఉన్న ప్లాట్ చందన్ యాదవ్ అనే వ్యక్తిదిగా తేలింది. ఈ అడ్రస్‌తో ఇంత మంది ఓటర్లు ఉన్న విషయం తనకు తెలియదని ఆయన చెబుతున్నారు. 22 మంది ఉన్న రెండో ఇంటి సంగతిని చూస్తే.. అది సంజయ్ కుమార్ చౌరాసియా అనే 60 ఏళ్ల వ్యాపారస్తునిది. ఇదే ఇంటిలో ఆయన కుటుంబం ఏడు దశాబ్దాలుగా ఉంటున్నది. ఆ ఇంటిలో 9 మంది ఆయన కుటుంబీకులు ఉంటున్నారు. కానీ.. వీరిలో ఒక్కరి పేరూ ఆ ఇంటి అడ్రస్‌తో ఉన్న ఓటరు జాబితాలో లేకపోవడం గమనార్హం. ఈ ఇంటి అడ్రస్‌తో ఓటర్ జాబితాలో నమోదైన వారి పేర్లు చదివి వినిపించగా.. ఏ ఒక్కరి పేరునూ ఆయన గుర్తించలేకపోయారు. ఇవన్నీతప్పుడు పేర్లని, వాటిని జాబితాలో చొప్పించారని ఆయన ఆరోపించారు.
12 నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్‌వో చందన్ కుమార్‌ను ఈ విషయంలో స్పష్టత కోరగా.. ఒకే అడ్రస్‌లో అనేక మందిని తాను రిజిస్టర్ చేయలేదని చెప్పారు. తాము ఇంటి నంబర్ల ఆధారంగా తాము వెళ్లబోమని, పేర్ల వారీగానే చూస్తామని చెప్పారు. ఏడాది క్రితమే చందన్ కుమార్ బీఎల్‌వో అయ్యారు. తనకు గతంలో ఇటువంటి వాటిలో అనుభవం లేదని అన్నారు. ఒకే అడ్రస్‌తో అనేక మంది పేర్లు ఓటర్లుగా నమోదై ఉన్న ముసాయిదా ఓటరు జాబితాను అతనికి చూపగా.. ఈ తప్పులు తన వైపు నుంచి జరిగినవి కావని చెప్పారు. తాను ఓటర్లను సరైన పద్ధతిలోనే రిజిస్టర్ చేశానని బదులిచ్చారు.
మధుబన్ నియోజకవర్గం రాజ్‌పూర్‌లోని కౌలా మడపా మాల్ గ్రామం 160 పోలింగ్ కేంద్రం కిందకు వస్తుంది. ఇక్కడ ఇంటి నంబర్ 50లో ఏకంగా 274 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పక్కా ఇల్లు గజేంద్ర మండల్ అనే వ్యక్తిది. తన తండ్రి జీవితాంతం ఈ ఇంటిలోనే నివసించాడని ఆయన కుమారుడు రాజేశ్ మండల్ చెప్పారు. ఇంత మంది పేర్లు తమ ఇంటి అడ్రస్‌తో ఎలా రిజిస్టర్ అయ్యాయో తనకు తెలియదని ఆయన అన్నారు. ఈ ఇంట్లో తన భార్యాపిల్లలతో నివసిస్తున్నానని చెప్పారు.
అయితే.. మండల్‌కు చెందిన ఇంటి అడ్రస్‌తో రిజిస్టర్ అయిన 274 ఓట్లు అసలైనవేనని స్థానిక బీఎల్‌వో పతిత్ పావన కుమార్ చెప్పారు. ఈ సమస్య దాదాపు ఏడేళ్ల నుంచి ఉందని ఆయన తెలిపారు. మండల్‌కు చెందిన ఇల్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1200 దాటడంతో ఇటీవల రెండుగా చీలిందని చెప్పారు. పోలింగ్ కేంద్రం చీలక ముందు కూడా అనేక ఇళ్లలో వంద నుంచి 150 మంది ఓటర్లు ఉండేవారని తెలిపారు. మండల్ ఇంటి అడ్రస్‌తో నమోదైన ఓటర్లు అసలైనవారేనని, కాకపోతే తప్పు అడ్రస్‌తో ఉన్నారని పతిత్ చెబుతున్నారు. ఓటర్లు సమర్పించిన నివాసధృవీకరణ పత్రం స్థానిక పంచాయతీ జారీ చేసిందేనని, వాటిలో ఇంటి నంబర్ ప్రస్తావన లేదని పేర్కొన్నారు. కొన్ని చోట్ల కాగితాల్లో ఇంటి చిరునామాలు రికార్డ్ అయి ఉన్నాయి కానీ.. క్షేత్రస్థాయిలో అవి కనిపించలేదని ఈ అధ్యయనం నిర్వహించిన పాత్రికేయులు పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని రవి నాయర్, సాచి హెగ్డే, అయూష్ జోషి, రునాఖ్ సారస్వత్ విశ్లేషించారు. క్షేత్రస్థాయిలో అబిర్ దాస్ గుప్తా, అరుణ్ కుమార్ ద్వివేది (నెట్‌వర్క్ 10), మన్సూర్ అహ్మద్ (సీన్యూస్ భారత్), ప్రభాత్ కుమార్, పార్థ్ ఎమ్ ఎన్, పూజ మిశ్రా (ఆవాజ్ 24), ఓం ప్రకాష్ మిశ్రా (భారత్ 24), రాజీవ్ రాజ్ (బీహార్ న్యూస్), రంజీత్ గుప్తా, సంతోష్ నాయక్ (ది పొలిటికల్ లీడర్), అతిక్ అహ్మద్, ఇమ్రాన్ ఖాన్, జయదేవ్ యాదవ్, అమిత్ సింగ్ (ఇండియా డైలీ లైవ్) పాల్గొన్నారు.
కొన్ని ఉదాహరణలు
నియోజకవర్గం | బూత్ నంబర్ | ఇంటి నంబర్ | ఇంటిలో ఓటర్లు |
1. కతిహార్ | 222 | 82 | 197 |
2. కతిహార్ | 175 | 4 | 136 |
3. కతిహార్ | 203 | 60 | 108 |
4. పూర్ణియా | 12 (పార్ట్ 1) | 2 | 22 |
5 పూర్ణియా | 12 (పార్ట్ 2) | 2 | 153 |
6. పూర్ణియా | 12 (భాగం 1) | 3 | 84 |
7. హర్సిధి | 288 | 2 | 82 |
8. హర్సిధి | 114 (పార్ట్ 2) | 5 | 48 |
9. మధుబన్ | 120 | 129 | 389 |
10. మధుబన్ | 160 | 50 | 274 |
11. మధుబన్ | 127 | 145 | 109 |
12. మధుబన్ | 121 (భాగం 1) | 39 | 95 |
13. మధుబన్ | 121 (భాగం 3) | 99 | 64 |
14. మధుబన్ | 294 | 6 | 81 |