వికసిత భారత్ సాధనకు బీజేపీ సంకల్ప్‌పత్ర మ్యానిఫెస్టో

మూడోసారి అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఆదివారం 2024పార్లమెంటు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది

  • Publish Date - April 14, 2024 / 04:00 PM IST

ఢిల్లీలో విడుదల చేసిన ప్రధాని మోదీ
14అంశాలపై హామీలు

విధాత : మూడోసారి అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఆదివారం 2024పార్లమెంటు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27మంది సభ్యుల కమిటీ కసరత్తుతో..15లక్షల మంది అభిప్రాయాల సేకరణతో సంకల్ప్ పత్ర పేరుతో రూపొందించిన పార్టీ మ్యానిఫెస్టోను ఢిల్లీలోని బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ విడుదల చేశారు. అన్ని వర్గాల అభివృద్ధే బీజేపీ పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. యువత, మహిళలు, రైతులు, పేదల అభ్యున్నతి ఎజెండాగా వికసిత భారత్ లక్ష్యంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లుగా మోదీ తెలిపారు. వచ్చే ఐదేళ్లు కూడా దేశ వ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులనూ, ట్రాన్సజెండర్లను ఆయుష్మాన్ భారత్‌లో చేరుస్తామని వెల్లడించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని, అంతేకాకుండా మరో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. భవిష్యత్తులో పైపులైన్ ద్వారా ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందిస్తామని తెలిపారు. ముద్ర పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ. 20 లక్షలు చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని పేర్కొన్నారు. 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారు. మహిళలు పారిశ్రామికవేత్తలయ్యేలా ప్రోత్సహిస్తామని, వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామన్నారు. పీఎం సూర్యఘర్‌ పథకానికి కోటి మంది రిజిస్టర్‌ చేసుకున్నారని.. ఇంట్లో తయారైన కరెంట్‌ను ప్రజలు అమ్ముకోవడానికి కూడా వీలుంటుందని ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయబోతున్నామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని, వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగం పెంచుతామని తెలిపారు. దేశాన్ని గ్లోబల్‌ న్యూట్రిషన్‌ హబ్‌గా మారుస్తామని, శ్రీఅన్న రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు ఉంటుందని ఇందుకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తామి, దేశాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తామని, నానో యూరియా వినియోగం మరింత పెంచుతామని ప్రధాని మోదీ ప్రకటించారు. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఉత్తర దక్షిణ తూర్పు భారతత్‌కు కూడా బుల్లెట్ రైలు సేవలు విస్తరిస్తామన్నారు. వందే భారత్ రైలు సర్వీస్‌లను దేశంలోని ప్రతి మూలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి)ని అమలు చేస్తామని, ‘ఒకే దేశం, ఒకే పోల్’పై దృష్టి సారిస్తామని పార్టీ తెలిపింది. మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మ్యానిఫెస్టోలోని 14అంశాలు
1) విశ్వబంధు 2) సురక్షిత భారత్ 3) సమృద్ధ భారత్ 4) ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్ప 5) జీవన సౌలభ్యం 6) గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్ 7) సాంస్కృతిక వికాసం 8) గుడ్ గవర్నెన్స్ 9) స్వస్థ భారత్ 10) అత్యుత్తమ శిక్షణ 11) క్రీడావికాసం 12) సంతులిత అభివృద్ధి 13) సాంకేతిక వికాసం 14) సుస్థిర భారత్ అంశాలున్నాయి.

Latest News