మళ్లీ బీజేపీ గేమ్‌ ప్లాన్‌?

తాను మైనార్టీలో ఉండి.. తాను నాయకత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమి బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాజకీయ సుస్థిరతకు బీజేపీ భారీ స్కెచ్‌లే వేస్తుందని అంతా ఊహిస్తున్నారు

  • Publish Date - June 11, 2024 / 06:49 PM IST

యూపీలో ఆరుగురు ‘ఇండియా’ ఎంపీలపై క్రిమినల్‌ కేసులు..
అనర్హత వేటు వేయిస్తే బలాబలాల్లో మార్పు
ఉప ఎన్నికలకు అవకాశంపై ఎన్డీయేలో ఆశ
ఏదో ఒకటి చేసి సంకీర్ణంలో పైచేయి సాధించే యత్నం
న్యూఢిల్లీ : తాను మైనార్టీలో ఉండి.. తాను నాయకత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమి బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాజకీయ సుస్థిరతకు బీజేపీ భారీ స్కెచ్‌లే వేస్తుందని అంతా ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మళ్లీ ఆపరేషన్‌ కమల్‌ను ప్రారంభించే అవకాశాలు లేకపోలేదని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా టీడీపీ, జేడీయూU.P,ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా చంద్రబాబు, జేడీయూ గత అనుభవాల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో ఉన్నదనేది మాత్రం సత్యం. అయితే.. దీని నుంచి బయటపడేందుకు అతి త్వరలోనే బీజేపీ గేమ్‌ప్లాన్‌ సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి నుంచి గెలిచినవారిలో క్రిమినల్‌ కేసులు ఉన్న ఎంపీలను బీజేపీ టార్గెట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ తీవ్ర ఎదురుదెబ్బలు తిన్నది. 80 సీట్లు ఉన్న యూపీలో ఎన్డీయే 36 సీట్లలో (బీజేపీ 33), ఇండియా కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్‌ 43 సీట్లు గెలుచుకున్నాయి. సీట్లు తగ్గిపోవడంతో అది అంతిమంగా బీజేపీ మెజార్టీని తగ్గించి.. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి నెట్టాయి. ఎన్డీయే మనుగడకు ఢోకా లేకుండా చేసుకునేందుకు బీజేపీ తన సహజసిద్ధమైన సామ దాన బేధ దండోపాయాలు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ క్రమంలో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నవారు బీజేపీ టార్గెట్‌ అయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.

యూపీలో ఇండియా కూటమి తరఫున ఎంపీలుగా గెలిచిన సుమారు ఆరుగురిపై రెండేళ్ల కనీస జైలు శిక్ష పడే పలు క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. అయితే లొంగిపోవడం లేదా జైలుకు పోవడం.. గత పదేళ్లలో అభియోగాలు ఎదుర్కొన్నవారి విషయంలో జరిగింది ఇదే. చాలా మంది అభియోగాలు ఉన్న ఎంపీలు బీజేపీకి దాసోహం అనడంతో వారిపై మచ్చలన్నీ మటుమాయమయ్యాయి. వ్యతిరేకించి కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ వంటి వారు జైలుపాలయ్యారు. ఇప్పుడు అదే రీతిలో.. ఇండియా కూటమి తరఫున ఎంపీలుగా గెలిచిన ఆరుగురితో బీజేపీ గేమ్‌ ప్లాన్‌ రూపొందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారికి రెండేళ్ల జైలు శిక్ష పడితే.. వారు పార్లమెంటు సభ్యుడిగా అర్హత కోల్పోతారు. వారిలో ఘాజీపూర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఒకరు. ఆయన కొద్ది నెలల క్రితం హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌గా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన ముక్తార్‌ అన్సారీ పెద్ద సోదరుడు. గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ కేసులో ఇప్పటికే నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే.. అలహాబాద్‌ హైకోర్టు శిక్షపై స్టే ఇచ్చి, ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో విచారణ తిరిగి జూలైలో ప్రారంభం కానున్నది. అన్సారీకి విధించిన శిక్షను కోర్టు సమర్థిస్తే.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోతారు.
ఆజంగఢ్‌ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌పై నాలుగు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఆయనకు రెండేళ్లకు మించి శిక్ష పడితే.. ఆయన కూడా పార్లమెంటు సభ్యుడిగా అన్హతకు గురవుతారు. జాన్‌పూర్‌ ఎంపీ బాబు సింగ్‌ కుష్వాహాపై ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కుంభకోణానికి సంబంధించి 25 కేసులు ఉన్నాయి. ఈ కుంభకోణం మాయావతి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నాటిది.
బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీని సుల్తాన్‌పూర్‌ సీటులో ఓడించిన రాంభువల్‌ నిషాద్‌ 8 కేసులలో నిందితుడిగా ఉన్నారు. అందులో ఒకటి గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ కింద నమోదైంది. చందౌలి నుంచి గెలిచిన వీరేంద్రసింగ్‌, సహరాన్‌పూర్‌ ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ పైనా అనేక క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ ఆరుగురు ఇండియా కూటమి ఎంపీలపై మనీలాండరింగ్‌, గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ సహా అనేక కేసులు ఉన్నాయి. వీటిలో ఏ కేసులోనైనా రెండేళ్లకు మించి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో క్రిమినల్‌ కేసులలో శిక్షలు పడి పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన ఎంపీలు ఉన్నారు. మహ్మద్‌ ఆజం ఖాన్‌, ఖాబూ తివారి, విక్రం సైని, అశోక్‌ చండేల్‌ వంటివారు ఇలానే సభ్యత్వం కోల్పోయారు.

Latest News