Site icon vidhaatha

Calcutta | ఆర్‌జీ కర్ ఆసుపత్రిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్‌

ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా పనిచేస్తారని ఆగ్రహం
ఆసుపత్రి మూసేయడం మంచిదని వ్యాఖ్యలు

Calcutta  | పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిలపై జరిగిన హత్యాచార ఘటన పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుంటే ఇంకోవైపు అదే ఆసుపత్రిపై బుధవారం అర్ధరాత్రి దుండగులు దాడి చేయడం వివాదస్పదంగా మారింది. ఆర్‌జీ కర్ ఆసుపత్రిపై దాడి ఘటన పట్ల కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) సీరియస్‌గా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా విధులు నిర్వర్తించగలగరని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

లేదంటే ఆసుపత్రి మూసేయడమే మంచిదని అసహనం వ్యక్తం చేసింది.  హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా నిరసనలు తెలుపుతోంటే.. మరోవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, ఔట్ పేషంట్ విభాగాలతో (ఓపీడీ) పాటు సీసీ టీవీలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సుమారు 40 మంది వరకూ నిరసనకారుల రూపంలో వచ్చిన దుండగులు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారని, వీరి దాడిలో తమ వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. మరికొంతమంది పోలీసులకు గాయాలైనట్లు తెలిపారు.

గుంపును చెదరగొట్టడానికి తాము బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్లు వెల్లడించారు. ఆసుపత్రిపై దాడులతో రాష్ట్రంలో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు ఆర్‌జీకర్ ఆసుపత్రి హత్యాచార ఘటనలో నిందితుడికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) శుక్రవారం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఆదివారంలోగా కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే కోల్‌కతా పోలీసులు 30 శాతం దర్యాప్తును పూర్తి చేశారని వెల్లడించారు.

Exit mobile version