Rajya Sabha elections : రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం ఓట్లను లెక్కించనున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికై రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా తదితర రాజ్యసభ సభ్యులు ఇటీవల లోక్‌సభకు ఎన్నికయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఎన్నికల సంఘం పేర్కొంది.