Site icon vidhaatha

24 గంట‌ల్లో 80 లీట‌ర్ల పాలిచ్చిన ష‌కీరా.. బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్న ఆవు..!

చండీఘ‌ర్ : ఆవులు పాలివ్వ‌డం స‌హ‌జ‌మే. సాధార‌ణంగా రోజుకు 20 నుంచి 30 లీట‌ర్ల వ‌ర‌కు పాలిచ్చే ఆవుల‌ను చూసే ఉంటాం. కానీ ఈ ఆవు మాత్రం ఒక్క రోజులో 80 లీట‌ర్ల పాలిచ్చి రికార్డు సృష్టించింది. అంతేకాదు బుల్లెట్ బైక్‌ను కూడా సొంతం చేసుకుంది ఆవు. వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌ర్యానాలోని క‌ర్నాల్ జిల్లాలోని ఝిఝారీ అనే గ్రామానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముళ్లు సునీల్, సంకీ ప‌శువుల‌ను పెంచుకుంటున్నారు. వీరి ఫామ్‌లో ష‌కీరా అనే ఒక ప్ర‌త్యేక‌మైన ఆవు ఉంది. తాజాగా కురుక్షేత్ర‌లో డెయిరీ అసోసియేష‌న్ నిర్వ‌హించిన‌, మిల్కింగ్ చాంపియ‌న్ పోటీల్లో ఈ ఆవు పాల్గొంది. 24 గంట‌ల్లో 80 లీట‌ర్ల పాలిచ్చి చ‌రిత్ర సృష్టించింది. 8 గంట‌ల విరామం ఇస్తూ రోజులో మూడుసార్లు యంత్రాల ద్వారా పాలు పితికారు. దాంతో 80 లీట‌ర్ల 756 గ్రాముల పాలిచ్చి మొద‌టి స్థానంలో నిలిచింది ష‌కీరా. ఇక ఆ ఆవు బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకుంది. భార‌త‌దేశంలోనే కాదు.. ఆసియాలోనే ఒక రోజులో అత్య‌ధికంగా పాలిచ్చిన ఆవుగా ష‌కీరా రికార్డుల్లోకి ఎక్కింది.

ఈ సంద‌ర్భంగా ష‌కీరా య‌జ‌మానులు సునీల్, సంకీ మాట్లాడుతూ.. గ‌త 12 ఏండ్ల నుంచి ప‌శువుల‌ను పెంచుకుంటున్నామ‌ని తెలిపారు. తామ డెయిరీ ఫామ్‌లో ప్ర‌స్తుతం 120 ఆవులు, గేదెలు ఉన్నాయ‌న్నారు. ష‌కీరా వ‌య‌సు ఆరేండ్లు కాగా, ఇప్ప‌టికీ నాలుగు దూడ‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఆవు ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి ప్ర‌త్యేకంగా ఎలాంటి ఆహారం పెట్ట‌లేదు. పోటీల్లో పాల్గొనే ముందు నీళ్లు ఎక్కువ‌గా ఇచ్చాం. గ‌తంలో నిర్వ‌హించిన పోటీల్లో 24 గంట‌ల్లో 72 లీట‌ర్ల పాలిచ్చి రికార్డు సృష్టించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

Exit mobile version