Earth | భూ భ్రమణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులు పెను ప్రభావమే చూపుతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులు భూమి అక్షం మార్పునకు దారి తీస్తోందని స్విట్టర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ యూనివర్సిటీ పరిశోధన సంచలన విషయాలు వెల్లడించింది. ధ్రువపు మంచు కరుగుతోందని, ఈ నీరంతా భూమధ్యరేఖ వైపు ప్రవహింస్తోంది.. పర్యవసానంగా గ్రహం భ్రమణ వేగాన్ని తగ్గిస్తోందని అధ్యయనం పేర్కొంది. ఫలితంగా పగటి సమయం కాస్త ఎక్కువగా ఉండేందుకు ఈ పరిణామం దారితీస్తుందని వివరించింది. ఈ మేరకు ‘నేచర్ జియోసైన్స్’లో ఈ అధ్యయనాన్ని ప్రచురతమైంది. కాగా, ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ బెనెడిక్ట్ సోజా స్పందిస్తూ.. వ్యక్తులు తమ చేతిని చాచి తిప్పుతున్న సదృశ్యానికి ఉదాహరణగా వివరించారు.
భూమి ద్రవ్యరాశి అక్షం నుంచి దూరంగా కదిలినప్పుడు భ్రమణ వేగం పెరుగుతుందని, ద్రవ్యరాశి రివర్స్‌లో పంపిణీ అయినప్పుడు భ్రమణం నెమ్మదిస్తుందని ఆయన వివరించారు. సాధారణంగా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై ఉంటుంది. కార్భన ఉద్గారాలను ఇదే స్థాయిలో మానువులు నిరంతరాయంగా కొనసాగిస్తే వాతావరణ మార్పులు చంద్రుడి ప్రభావాన్ని సైతం అధిగమించి ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని బెనెడిక్ట్ సోజా హెచ్చరించారు. వాతావరణ మార్పులు భూగ్రహంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. భూమి ఉపరితలంతో పోలిస్తే, లోపలిపొర భ్రమణం క్రమేపీ మందగిస్తున్నట్లు ఇటీవల పరిశోధనల్లో తేలింది. భూమి లోపలి కోర్, భూ ఉపరితలం కంటే చాలా నెమ్మదిగా తిరుగుతున్నట్లు ఇటీవల అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. లోపలికోర్ భ్రమణవేగం తగ్గడం 2010 నుంచి ప్రారంభమైందని.. 1991-2023 సంవత్సరాల మధ్య దక్షిణ అట్లాంటిక్‌లోని దక్షిణ శాండ్‌విచ్ దీవుల్లో జరిగిన అధ్యయనంలో వెల్లడైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
1971-1974 మధ్య నిర్వహించిన సోవియట్ అణు పరీక్షల డేటా, ఫ్రెంచ్, అమెరికన్ అణు పరీక్షల డేటాలను కూడా ఈ అధ్యయనంలో పరీక్షించారు. ఈ మార్పును భూకంపాలు, అణు పరీక్షల ద్వారా ఉత్పన్నమయ్యే భూకంప తరంగాలపై అధ్యయనాలు నిర్వహించారు. భూమి నాలుగు పొరలను కలిగి ఉంటుంది. వాటిలో ఇన్నర్ కోర్ (లోపలి పొర) ఘన రూపంలో ఉండి ఇనుము, నికెల్ మూలకాలతో ఏర్పడింది. ఇది భూమికి కేంద్రభాగమని చెప్పవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూ భ్రమణంలో మార్పుల కారణంగా పగలు, రాత్రుల నిడివి ఒక్కొక్కటి ఆరు నెలల వరకు పెరుగుతుందని.. వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. గాలి, సముద్ర ప్రవాహాలు భూ భ్రమణం మీదే ఆధారపడి ఉంటాయని.. భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు జరుగుతాయని చెప్పారు. భూమి గురుత్వాకర్షణ శక్తి తగ్గడం.. రోజుకు 24 గంటల కాలగమనంలో మార్పు రావడం.. ఈ రెండింటిపై లోపలిపొర భ్రమణ వేగంలో వచ్చిన మార్పులు గణనీయమైన ప్రభావం చూపుతుందని పరిశోధకులు వివరించారు.