AI Videos | కృత్రిమ మేధస్సు (AI) ) ఆధారిత విడియోలను వినియోగించే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను హెచ్చరించింది. బీహార్ శాసన సభకు సాధారణ ఎన్నికలు, దేశంలో ఎనిమిది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులపై ఏఐని ఉపయోగించి రాయడానికి వీలులేని రీతిలో వీడియోలు తీసి ప్రచారం చేసే ప్రమాదం ఉన్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నియమాలు ఇంటర్నెట్‌కు, సోషల్ మీడియాలో ప్రచురించే కంటెంట్‌కు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని 7 నిబంధనలను గురువారం ఉదయం మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
నిబంధనలు ఇవే..
1.బీహార్ శాసనసభ సాధారణ ఎన్నికలు మరియు 8 నియోజకవర్గాల ఉప ఎన్నికలు ప్రకటించబడిన 2025 అక్టోబర్ 6 తేదీ నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct – MCC) అమల్లోకి వచ్చింది. ఈ నియమాలు ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ప్రచురించే కంటెంట్‌కు కూడా వర్తిస్తాయి.
2.ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఇతర పార్టీలపై విమర్శలు చేయాలంటే అవి వారి పాలసీలు, కార్యక్రమాలు, గత రికార్డులు, పనితీరు వరకు మాత్రమే పరిమితం కావాలి. ఇతర పార్టీల నేతలు లేదా కార్యకర్తల వ్యక్తిగత జీవితంపై, ప్రజా కార్యక్రమాలకు సంబంధం లేని విషయాలపై విమర్శలు చేయకూడదు.
3.నిర్ధారించని ఆరోపణలు లేదా వక్రీకరణలపై ఆధారపడి చేసే విమర్శలు నివారించాలి.
4.సోషల్ మీడియా వేదికలపై తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు తయారుచేయడం లేదా ప్రచారం చేయడం వంటివాటికి AI ఆధారిత పరికరాలను దుర్వినియోగం చేయరాదని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ పట్ల నిజనిర్ధారణ, నిష్పాక్షికతను కాపాడటం అత్యవసరమని సూచించింది.
5.పార్టీలు, నాయకులు, అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు సోషల్ మీడియా లేదా ప్రకటనలలో AI సాయంతో రూపొందించిన సింథటిక్ కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించేలా లేబుల్ చేయాలి.
ఉదాహరణకు – “AI-Generated”, “Digitally Enhanced”, లేదా “Synthetic Content” అని స్పష్టంగా పేర్కొనాలి.
6.సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన పర్యవేక్షణ జరుగుతోంది, ఎన్నికల వాతావరణం చెడిపోకుండా చూడటానికి చర్యలు తీసుకుంటున్నారు.
7.ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి అమలు కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.