పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటింగ్‌ వివరాలిస్తే.. గందరగోళమేనట!

పోలింగ్‌ కేంద్రాలవారీగా నమోదైన ఓటింగ్‌ వివరాలు తమ వెబ్‌సైట్‌లో బహిరంగం చేస్తే ఇప్పటికే కొసాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో తలమునకలై ఉన్న ఎన్నికల యంత్రాంగంలో గందరగోళం సృష్టిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది

  • Publish Date - May 23, 2024 / 05:50 PM IST

సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: పోలింగ్‌ కేంద్రాలవారీగా నమోదైన ఓటింగ్‌ వివరాలు తమ వెబ్‌సైట్‌లో బహిరంగం చేస్తే ఇప్పటికే కొసాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో తలమునకలై ఉన్న ఎన్నికల యంత్రాంగంలో గందరగోళం సృష్టిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటింగ్‌ రోజు విడుదల చేసిన వివరాలకంటే ఐదు నుంచి ఆరుశాతం అధికంగా పోలింగ్‌ నమోదైనట్టు ప్రకటించారన్న ఆరోపణలను ఈసీ తిరస్కరించింది. పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓటింగ్‌ను ఫాం సీ ద్వారా వెల్లడిస్తారు.

దీనిని బహిరంగం చేయడం లేదా విచక్షణారహితంగా వెల్లడించడం చట్టపరిధిలో లేదని ఎన్నికల సంఘం తెలిపింది. వాటిని బయటపెడితే మొత్తం ఎన్నికల ప్రక్రియను ఉల్లంఘించినట్టు, దుర్వినియోగం చేసినట్టు అవుతుందని పేర్కొన్నది. వాస్తవ చిత్రాలకు మసిపూసే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ వివరాలతో కూడిన ఫాం 17సీని అప్‌లోడ్‌ చేసే విషయంలో ఈసీకి మార్గదర్శకాలు జారీ చేయాలని ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈసీ ఈ మేరకు 225 పేజీల అఫిడవిట్‌ ఇచ్చింది.

ప్రస్తుతానికి ఒరిజినల్‌ ఫాం 17సీ స్ట్రాంగ్‌రూమ్‌లలోనే ఉన్నదని, పోలింగ్‌ ఏజెంట్ల వద్ద వారి సంతకాలతో కూడిన కాపీ ఉన్నదని ఈసీ వెల్లడించింది. కనుక ప్రతి ఫాం 17సీ, దానిని అందుకున్న వారి మధ్య నేరుగా సంబంధం ఉన్నదని పేర్కొన్నది. దానిని ఇతరులకు ఇచ్చేందుకు అవకాశం లేదని తెలిపింది.

Latest News