Site icon vidhaatha

Hemant Soren । జార్ఖండ్‌ 14వ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్‌ సొరేన్‌

Hemant Soren । గురువారం రాంచీలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సొరేన్‌ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. హేమంత్‌ సొరేన్‌తో జార్ఖండ్‌ గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ప్రమాణం చేయించారు. 49 ఏళ్ల జేఎంఎం నేత జార్ఖండ్‌ ముఖ్యమంత్రి కావడం ఇది నాలుగోసారి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన బర్హెట్‌ సీటు నుంచి 39,791 ఓట్ల తేడాతో బీజేపీ ప్రత్యర్థి గామియేల్‌ హెంబ్రోమ్‌పై గెలుపొందారు. జార్ఖండ్‌ అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం నేతృత్వంలోని కూటమి 56 సీట్లలో గెలుపొంది ఘన విజయం సాధించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు 24 సీట్లు మాత్రమే దక్కాయి. హేమంత్‌ సొరేన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో రాంచీలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (ఎస్‌పీ) చీఫ్‌ శరద్‌పవార్‌, మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సుఖుతోపాటు అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉద్ధవ్‌ ఠాక్రె, అఖిలేశ్‌ యాదవ్‌, మెహబూబా ముఫ్తీ, తేజస్వి యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో రాంచీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతోపాటు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో హేమంత్‌ సొరేన్‌ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి హేమంత్‌ ఒక్కరే ప్రమాణం చేశారు. అసెంబ్లీలో విశ్వాస నిరూపణ తర్వాత క్యాబినెట్‌ విస్తరణ ఉంటుందని జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ గులాం అహ్మద్‌ మీర్‌ తెలిపారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇంత మంది ప్రముఖ నేతలు హాజరు కావడంపై హేమంత్‌ సొరేన్‌ సంతోషం వెలిబుచ్చారు.

 

Exit mobile version