Indian Army | న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్( Operation Sindoor ) తర్వాత నియంత్రణ రేఖ( LoC ) వెంబడి పాకిస్తాన్ సైన్యం( Pakistan Army ) కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత జవాన్( Jawan ) మృతి చెందినట్లు ఇండియన్ ఆర్మీ( Indian Army ) అధికారికంగా ప్రకటించింది. జవాన్ దినేష్ కుమార్ మృతికి వైట్ నైట్ కార్ప్స్ నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించింది. దినేష్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇక పాకిస్తాన్ రేంజర్ల కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో ఉంటున్న 15 మంది పౌరులు ప్రాణాలు విడిచారు. వీరి కుటుంబాలకు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఆర్మీ పేర్కొంది.
పహల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం మిస్సైళ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి నేలమట్టం చేసింది.
ఈ మెరుపు దాడులను జీర్ణించుకోలేని పాకిస్తాన్ ప్రభుత్వం.. భారత్‌పై కాల్పులకు పాక్ రేంజర్లను ఉసిగొల్పింది. నిన్న ఉదయం నుంచి పాక్ రేంజర్లు ఫూంచ్, తంగధర్ రీజియన్లలో కాల్పులకు పాల్పడ్డారు. సాయంత్రం 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక పాకిస్తాన్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.