గ్రీన్ కార్డు కోసం నిరీక్షణ..భారత్ లో సొంత కంపెనీకి నాంది!

15 ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసిన భారతీయ దంపతులు అమెరికాను వీడి బెంగళూరులో స్టార్టప్ ప్రారంభించారు. వారి నిర్ణయం ప్రవాస భారతీయులకు స్ఫూర్తిగా మారింది.

అమెరికాలో గ్రీన్ కార్డు(శాశ్వత నివాస హోదా) కోసం భారతీయులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక గ్రీన్ కార్డు విషయంలో పెడుతున్న ఇబ్బందులతో భారత్ వంటి దేశాల ప్రజలు నానా తిప్పలు పడుతూ..గ్రీన్ కార్డు కోసం నెలల తరబడిగా నిరీక్షిస్తున్నారు. అలాంటి ఓ ప్రవాస భారతీయుల జంట కూడా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసి..విసుగెత్తి పోయి..స్వదేశానికి చేరుకుని సొంత కంపెనీ ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జైపూర్ కు చెందిన ఆస్తా చతుర్వేది, విశాఖకు చెందిన కార్తీక్ జంట..అమెరికాలో దాదాపు 15ఏళ్లుగా గ్రీన్ కార్డుల కోసం నిరీక్షించారు. తరుచూ గ్రీన్ కార్డు నిబంధనలపై గందరగోళం నెలకొంటుండటంతో, గ్రీన్ కార్డు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో వారు కుటుంబంతో పాటు తిరిగి భారత్ కు చేరుకున్నారు. ఆస్తా చతుర్వేది, కార్తీక్ జంట బెంగళూరులో సొంతంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసుకొని తమ భవిష్యత్తు కోసం కొత్త ప్రయాణానికి నాంది పలికారు. ఇప్పుడు ఈ జంట తీసుకున్న నిర్ణయం అనేక మంది ప్రవాస భారతీయులకు స్పూర్తిగా నిలుస్తుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ అభినందిస్తున్నారు.

అమెరికాలో భారతీయ ప్రొఫెషనల్స్‌కు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికన్ గ్రీన్ కార్డు పొందడం దశాబ్దాలుగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా మారింది. ప్రతి ఏటా కేటాయించే కోటాల కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఉండటం, దేశాల వారీగా విధించిన పరిమితులు, తరుచూ మారుతున్న నిబంధనల మధ్య గ్రీన్ కార్డు కల సాకారం కోసం ప్రవాస భారతీయులు ఏళ్ల తరబడిగా నిరీక్షిస్తున్నారు. ఉద్యోగ భద్రత కోసం H-1B వీసాలపై ఆధారపడే భారతీయులు, ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త ప్రక్రియలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రాసెస్ పెండింగ్‌లో ఉన్నంత కాలం ఉద్యోగం మారడం లేదా ఇతర దేశాలకు ప్రయాణించడం కూడా ఇబ్బందికరంగా మారుతోంది.

తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఇకపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ పూర్తి చేయడం కుదరదని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప, మిగిలిన వారంతా అమెరికా వదిలి సొంత దేశానికి వెళ్లి అక్కడి యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారానే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని పేర్కంది. దీనివల్ల ఏళ్ల తరబడి గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న H-1B, L-1, F-1 వీసా హోల్డర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. అయితే, ఈ నిబంధనలు అమెరికా జాతీయ లేదా ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే వారికి వర్తించవని, ప్రతి ఒక్కరూ అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) తర్వాత స్పష్టతనిచ్చింది. ఇలా గ్రీన్ కార్డుల జారీ వ్యవహారంలో అమెరికా ప్రభుత్వ గందరోళ విధానాలతో ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు ఏళ్ల తరబడిగా గ్రీన్ కార్డు కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.

Latest News