H1B Visa | అమెరికాలో ఉండటమా? వదిలిరావడమా? దిగ్గజ కంపెనీలు ఎంప్లాయీస్‌కు ఏం చెబుతున్నాయి?

తమపై ఏదైనా చర్య తీసుకుంటారేమోనన్న భయం కారణంగా అనిశ్చితి నెలకొని ఉండటంతో తమ ఉద్యోగులు తగిన విధంగా పనిచేయలేకపోతున్నారని సిలికాన్‌ వ్యాలీలో ఒక కంపెనీ హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్‌ వెల్లడించారు.

H1B Visa | అమెరికాలో ఉండటమా? వదిలిరావడమా? దిగ్గజ కంపెనీలు ఎంప్లాయీస్‌కు ఏం చెబుతున్నాయి?

H1B Visa | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నూతన ఇమ్మిగ్రేషన్‌ పాలసీలు ప్రవేశపెట్టడంతో హెచ్‌1 బీ వీసాదారులు, ప్రత్యేకించి టెక్‌ సెక్టార్‌లో ఉంటున్న ఇమ్మిగ్రెంట్స్‌ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భారతదేశం నుంచి వెళ్లి అమెరికాలో పనిచేస్తున్నవారిలో అత్యధికులు టెక్నాలజీ సెక్టార్‌లో ఉద్యోగులుగానే ఉన్నారు. వారంతా అమెరికాలోనే కొనసాగాలా? లేక తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలా? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకసారి వెళితే తిరిగి రాలేరేమోనన్న భయం కూడా వారిని వెంటాడుతున్నది. ఈ తరుణంలో అమెరికాలోని ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌.. ఒక ఆసక్తికర వార్తను ప్రచురించింది. టెక్‌ దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, గూగుల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ తదితర  సంస్థలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్‌1బీ వీసాదారులు అమెరికాను వదిలి వెళ్లిపోవడాన్ని ఎంచుకోవద్దని సలహా ఇస్తున్నాయని వెల్లడించింది.

అమెరికాలో హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే. ఆ తర్వాతి స్థానంలో చైనా, కెనడా ఇమ్మిగ్రెంట్స్‌ ఉన్నారు. హెచ్‌1బీ వీసాదారులకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ మద్దతు పలికినప్పటికీ.. ఆయన యంత్రాంగ ఓవరాల్‌ ఇమ్మిగ్రేషన్‌ పాలసీలు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇద్దరు హెచ్‌1బీ వీసాదారులను ఆ పత్రిక ఇంటర్వ్యూ చేయగా.. భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని ముందు వేసుకున్న ప్లాన్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నామని వారు తెలిపారు. ఒకసారి వెళితే తిరిగి రాలేమన్న భయంతోనే ఈ ఆలోచనను విరమించుకున్నట్టు వెల్లడించారు. మరో భారతీయ టెక్‌ నిపుణుడు.. తమ పిల్లల జాతీయత భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. తమ బిడ్డలు అమెరికా పౌరులు అవుతారా? లేక భారతీయులుగానే ఉంటారా? అన్న విషయంలో డైలమాలో ఉన్నామని చెప్పారు.

‘అమెరికా పౌరులు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇల్లీగల్‌గా ఉండొచ్చనే భావన ఉన్నది’ అని ఒక హెచ్‌1బీ వీసా వర్కర్‌ పేర్కొన్నట్టు తెలిపింది. వీసా రెన్యూవల్స్‌ కోసం నిత్యం పత్రాలు పట్టుకుని తిరగాల్సి వస్తున్నదని, జాప్యం జరుగకుండా చూసుకునేందుకు ఖర్చు కూడా అదనంగా అవుతున్నదని కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు. తమపై ఏదైనా చర్య తీసుకుంటారేమోనన్న భయం కారణంగా అనిశ్చితి నెలకొని ఉండటంతో తమ ఉద్యోగులు తగిన విధంగా పనిచేయలేకపోతున్నారని సిలికాన్‌ వ్యాలీలో ఒక కంపెనీ హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్‌ వెల్లడించారు. అమెరికా టెక్‌ ఇండస్ట్రీ.. దేశవిదేశల నిపుణులకు గ్లోబల్‌ హబ్‌గా ఉన్నది. ఇన్ఫోసిస్‌, కాగ్నిజంట్‌ వంటి కంపెనీలు అత్యధికంగా హెచ్‌1బీ దరఖాస్తులను కలిగి ఉన్నాయి.