Dharmasthala Files | కర్ణాటక ధర్మస్థల (Karnataka Dharmasthala)లో సామూహిక ఖననాల (mass grave) మిస్టరీ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా పోలీసులు సిట్ (SIT) ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగిస్తున్న క్రమంలో సోమవారం 11వ పాయింట్ వద్ధ ఎత్తైన ప్రదేశంలో నాలుగు మృతదేహాల అవశేషాలు వెలికితీసినట్లుగా సమాచారం. అధికారులు ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన..చూపించిన ప్రాంతాలను మొత్తం 13పాయింట్లు గుర్తించగా..8,9,10 పాయింట్లలో 8ఫీట్ల వరకు తవ్వకాలు చేసినా ఏం లభించలేదు. దీంతో 11,12,13వ పాయింట్ల వద్ధ తవ్వకాలు చేపట్టగా..11వ పాయింట్ లో నాలుగు మృతదేహాల అవశేషాలు బయటపడినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. సిబ్బంది భారీగా ఉప్పు బస్తాలు ఆ ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ ప్రాంతాల్లో మరిన్ని మృతదేహాలు వెలుగు చూడవచ్చన్న అంచనాలతోనే ఉప్పు బస్తాలు ఆ ప్రాంతానికి తరలించారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలిలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.
‘జీపీఆర్’ టెక్నాలజీ వినియోగానికి డిమాండ్
అయితే పదేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో చాలా మార్పులు సంభవించడం.. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలతో పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన మృతదేహాల ఖననం ప్రాంతాలను గుర్తించడం కష్టంగా మారుతుంది. ఈ కేసులో బాధితులు సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్‌ను కోరుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ తరహా తవ్వకాల్లో ఎక్కువగా ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను వినియోగిస్తుంటారు. జీపీఆర్ టెక్నాలజీ అయితే బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండటం ద్వారా ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపి భూమి పొరల్లోని ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తించి నిర్థిష్టంగా తవ్వకాలు జరిపేందుకు ఉపకరిస్తుందన్న వాదన వినిపిస్తుంది. ఇందుకు ప్రభుత్వం ఎంతమేరకు అంగీకరిస్తుందన్నది చూడాల్సి ఉంది.
త్రవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల్లో యాంటీ నక్సల్ ఫోర్స్ ను కాపలా విధుల్లో మోహరించారు. ఇప్పటికైతై నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్‌లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని చోట్ల పాన్ కార్డు, ఏటీఎం కార్డు లభించాయి. పాన్ కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్‌తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
