Site icon vidhaatha

Wayanad | వాయనాడ్‌ విపత్తు : ఇంత మంది గల్లంతయ్యారా?

వాయనాడ్‌ : కేరళలోని వాయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైనవారి పేర్లతో ముసాయిదా జాబితాను కేరళ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 138 మంది జాడ తెలియడం లేదని అందులో తెలిపారు. విపత్తుకు గురైన ప్రాంతాల్లో నివసించేవారి రేషన్‌ కార్డులు, ఓటర్‌ కార్డుల ఆధారంగా ఈ జాబితా రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ‘గ్రామపంచాయతీలు, ఐసీడీఎస్‌లు, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు, లేబర్‌ ఆఫీస్‌, జిల్లా ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తదితర కార్యాలయల నుంచి సేకరించిన రికార్డుల ఆధారంగా గల్లంతైనవారి జాబితాను రూపొందించాం’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

సహాయ శిబిరాల్లో ఉంటున్నవారు, బంధువుల వద్ద, హాస్పిటళ్లలో ఉంటున్నవారితోపాటు, మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించి, గల్లంతైనవారి జాబితాను రూపొందించినట్టు వివరించారు. ఇది తొలి ముసాయిదా మాత్రమేనని, ప్రజలు దీనిని తనిఖీ చేసుకుని, ఇతరత్రా వివరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలని కోరారు. వివిధ మార్గాల్లో మరోసారి తనిఖీ చేసుకుని, జాబితాలో మార్పులు చేస్తామని ప్రకటించారు. ముసాయిదా జాబితాను https://wayanad.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రజలు ఏమైనా సమాచారం పంచుకోవాలనుకుంటే 8078409770 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.

ఇదిలా ఉంటే.. గల్లంతైనవారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు 9వ రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు వెయ్యి మంది సహాయ సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. వారిలో ఆర్మీ, నేవీతోపాటు 500 మంది వాలంటీర్లు కూడా ఉన్నారు. జూలై 30 తెల్లవారుజామున సంభవించిన ఘోరకలిలో చనిపోయిన వారి సంఖ్య 226కు పెరిగింది.

Exit mobile version