Site icon vidhaatha

Lok Sabha Elections | ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌..!

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ మొదలైంది. రెండో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 16 లక్షలకుపైగా సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేసింది.

వాస్తవానికి రెండో దశలో 89 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణంతో అక్కడ పోలింగ్‌ మే 7వ తేదీకి వాయిదాపడింది. రెండో దశలో భాగంగా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తొలి దశలో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19వ తేదీన పోలింగ్‌ జరిగింది. తొలిదశలో 65.5 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఈ రెండో దశలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీనియర్‌ నేత శశిథరూర్‌, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌, బీజేపీ యువ నాయకుడు తేజస్వి సూర్య, అలనాటి అందాల తార హేమామాలిని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్‌), ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌ (రాజ్‌నంద్‌గావ్‌) తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. రెండో విడతలో 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 34 లక్షలకు పైగా కొత్త ఓటర్లు ఉన్నారు.

Exit mobile version