Site icon vidhaatha

నేడు రాహుగ్రస్త చంద్రగ్రహణం.. మూతపడనున్న ఆలయాలు..!

ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం నేడు ఏర్పడబోతున్నది. దేశ కాలమాన ప్రకారం అర్ధరాత్రి 1.05 గంటలకు గ్రహణం మొదలుకానున్నది. ఉదయం 2.23 గంటల వరకు గ్రహణం కొనసాగుతున్నది. గ్రహణ కాలం 1.19గంటలు. ఈ చంద్రగ్రహణం భారత్‌తో పాటు ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణం కనిపించనున్నది. ఇది పాక్షిక గ్రహణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాస్తవానికి చంద్రుడు, సూర్యుడి మధ్యలో భూమి ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఆవిష్కృతమవుతుంది. సూర్య కిరణాల కారణంగా భూమి నీడ చంద్రుడి ఉపరీతలంపై పడుతుంది.


ఫలితంగా కాంతి తగ్గుతుంది. ఫలితంగా చంద్రుడు కొంతసేపు కనిపించకుండాపోతాడు. అయితే, ఈ సారి ఏర్పడబోతున్న గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం, పౌర్ణమి చంద్రుడు, సూర్యుడి మధ్యలోకి భూమి వస్తే ఇలా జరుగుతుంది. ఇక వచ్చే ఏడాది ఐదు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు, మూడు చంద్రగ్రహణాలున్నాయి. మార్చిలో పెనుంబ్రల్‌, సెప్టెంబర్‌లో పాక్షిక, అక్టోబర్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నాయి. ఇక భారత్‌లో చివరిసారిగా నవంబర్‌ 8, 2022న సంపూర్ణ చంద్రగ్రహనం దర్శనమిచ్చింది.


భారత్‌పై ప్రభావం.. ఆలయాల మూసివేత


పాక్షిక చంద్రగ్రహణం భారత్‌పై ప్రభావం చూపబోతున్నదని జోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అందరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. గ్రహణం కుమార పౌర్ణమి రోజున రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడుతుందని చెప్పారు. గ్రహణాన్ని కొన్ని రాశుల వారు చూడకూడదని.. మరికొన్ని రాశుల వారికి గ్రహణం శుభ ఫలితాలను ఇవ్వబోతున్నదని పండితులు పేర్కొన్నారు. మేష, కర్కాటక, సింహ రాశుల వారితో పాటు అశ్వనీ నక్షత్రంలో పుట్టిన వారు గ్రహణాన్ని ఎట్టిపరిస్థితుల్లో చూడకూడదని.. మూడు రాశులు మినహా మిగతా రాశుల వారందరికీ మంచి ఫలితాలు ఉండబోతున్నాయని వివరించారు.


ఆలయాల మూసివేత


పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాలు మూతపడనున్నాయి. గ్రహణం ప్రారంభానికి ఆరు గంటల ముందు ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ. ఇవాళ రాత్రి 7.05 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేసి.. తెల్లవారు జామున శుద్ధి చేసి ఏకాంత సేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. శ్రీశైలం, సింహాచలం, అలాగే తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, అలంపూర్‌ జోగులాంబ ఆలయాలతో పాటు అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. మళ్లీ శుద్ధి అనంతరం ఆలయాలను తెరిచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

Exit mobile version