Maharashtra । మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేసేందుకు అడ్డంకులు తొలగిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే.. ఎన్డీయే తీసుకునే నిర్ణయానికి తమ పార్టీ కట్టబడి ఉంటుందని బుధవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. . కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయానికి శివసేన పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో నిర్ణయం తీసుకోవాలని తాను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను కోరానని, ఆ నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పానని తెలిపారు. తన నాయకత్వంలోనే మహాయుతి విజయం సాధించినా మరోసారి తనకు ముఖ్యమంత్రి పదవి దక్కడం లేదనే అసంతృప్తిలో ఏక్‌నాథ్ షిండే ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన మీడియాకు ఈ మేరకు వివరణ ఇచ్చారు.
బీజేపీ నేత, షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీలోని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ‘మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పేరు విషయంలో బీజేపీ తీసుకునే నిర్ణయానికి మా శివసేన పూర్తిగా మద్దతు ఇస్తుంది. మా వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండబోవు’ అని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరు ఉంటారన్న మీడియా ప్రశ్నకు.. గురువారం అమిత్‌షాతో ఢిల్లీలో జరిగే సమావేశంలో ఈ అంశం చర్చిస్తామని బదులిచ్చారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన చర్యలను ఆ సమావేశంలో నిర్ణయిస్తామని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి ఘన విజయం కట్టబెట్టారంటూ మహారాష్ట్ర ప్రజలకు ఏక్‌నాథ్ షిండే ధన్యవాదాలు తెలిపారు. ‘నేను తీవ్ర స్థాయిలో ప్రచారం చేశాను. మరుసటి రోజు ప్రచారానికి బయలుదేరడానికి ముందు రెండు మూడు గంటలే నిద్ర పోయేవాడిని’ అని చెప్పారు. మహాయుతిలోని బీజేపీ 132 సీట్లు గెలిచి కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. ప్రజాదరణ పొందేందుకు తాను ముఖ్యమంత్రి కాలేదని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రిని అయ్యానని షిండే అన్నారు. ‘ఎప్పటికీ నేను కార్యకర్తనే. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కామన్ మ్యాన్ అనేదే నా ఉద్దేశం’ అని చెప్పారు. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల తన పదవీకాలంలో సహకరించిన బీజేపీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రను నంబర్ 3 స్థానం నుంచి నంబర్ 1 స్థానానికి నేను ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే తీసుకెళ్లేందుకు మేం పనిచేశాం. నాకేమీ నిరుత్సాహం లేదు. మేం పోరాడుతాం.. విలపించం’ అని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. మంగళవారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన షిండే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే.. తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరారు.