విధాత : ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు స్వగ్రామం చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో ఘనంగా అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఏపీలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం హిడ్మా మృతదేహం స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తికి చేరుకుంది. హిడ్మా మృతదేహం రాకతో పరిసర గ్రామాల్లోని ఆదివాసీలు ఆయనను కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చారు. హిడ్మా మృతదేహాన్ని చూసిన తల్లి మాంజు, ఇతర బంధువులు.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. హిడ్మాను చూసేందుకు వస్తున్న ఆదివాసీల రోధనలతో ఆ ప్రాంతం శోక సంద్రంగా కనిపించింది. ప భద్రతా బలగాలు భారీ ఎత్తున గ్రామంలో మోహరించాయి. అయినప్పటికి బెదరకుండా హిడ్మాను చూసేందుకు ఆదివాసీలు భారీగా తరలివస్తుండటం చూస్తే..ఆ ప్రాంతంలో ఆయనకున్న ప్రజాదరణకు నిదర్శనంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
పువర్తి గ్రామంలో కేవలం 50 ఇళ్లు మాత్రమే ఉండగా..ఇక్కడి నుంచి ఏకంగా 90 మంది యువకులను హిడ్మా మావోయిస్టులుగా మార్చడం విశేషం. హిడ్మా ఎన్ కౌంటర్ అనంతరం గ్రామంలోని 50 ఇళ్లలో సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా పార్టీలో హిడ్మా తర్వాత కీలక నేతగా కొనసాగుతున్నారు. పువర్తి, పరిసర గ్రామాలు దశాబ్ధాలుగామావోయిస్టుల పూర్తి నియంత్రణలో ఉన్నాయి. ఏడాది కిందట సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేసి ఆపరేషన్ కగార్ కొనసాగిస్తుంది. హిడ్మా తలపై ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన రివార్డు మొత్తం రూ.1.80 కోట్లుగా ఉండటం విశేషం.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిడ్మా స్వగ్రామం పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని 547 ఓట్లకు గాను కేవలం 31 ఓట్లు పోలవ్వగా, పూవర్తి గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
