VB G Ram G | రెండు దశాబ్ధాల క్రితం గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ కల్పించేందుకు ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం శకం ముగిసింది. దీని స్థానే వికసిత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) అమలులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకం ప్రారంభించారు కాని దశాబ్దకాలంగా అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం 2005 సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి 100 పనిదినాలు కల్పించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టారు. అయితే లక్ష్యాలను అధిగమించడంలో విఫలం అయిందనేది ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం కూలీలకు ఉపాధి హామీ కల్పించడంలో సఫలం కాలేదని స్పష్టమవుతున్నది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వంద రోజుల పనిదినాల బదులు గడచిన దశాబ్ధంలో 52 రోజులకు మించి ఎక్కడా పని కల్పించలేదు.
ఆర్థిక సంవత్సరం 2016 లో 48.9 రోజులు, 17 లో 46 రోజులు, 18 లో 45.7, 19 లో 50.9, 2020లో 48.4, 21లో 51.5, 22లో 50.1, 23లో 47.28, 24లో 52.1, 2025లో 50.2 రోజులు కూలీలకు పని కల్పించారు. దశాబ్ధకాలం లెక్కలను పరిశీలిస్తే సగటున సగం రోజులకు మించి గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ కల్పించారు. కోవిడ్ వ్యాపించిన సంవత్సరం 2021 లో కూడా 51.5 రోజులు మాత్రమే పనులు కల్పించారు. ప్రతి కూలీకి చెల్లిస్తున్న వేతనాలు పరిశీలిస్తే పదేళ్లలో 70 శాతం పెంచారు. 2016 సంవత్సరంలో పనికి వచ్చిన ఒక్కొక్కరికి రూ.154 చొప్పున చెల్లించగా, 2019లో రూ.179, 2021లో రూ.200, 2025 సంవత్సరంలో రూ.267 చొప్పున చెల్లించారు. 2016 సంవత్సరంలో కూలీలు రూ.44వేల కోట్లు ఖర్చు చేయగా, కోవిడ్ తరువాతి నుంచి ప్రతి సంవత్సరం రూ.1 లక్ష చొప్పున ఖర్చు చేశారు.
2020లో 5.5 కోట్ల మంది ఉపాధి పొందగా 2021 లో 7.6 కోట్ల మందికి పని లభించింది. వంద రోజుల పనిదినాల హామీ లో 2026 లో 4.8 కోట్ల కుటుంబాలు పనిచేయగా, అందులో 0.48 కుటుంబాలు మాత్రమే వంద రోజులు పనులు చేశాయి. 2025 సంవత్సరంలో 5.8 కోట్ల కుటుంబాలు పనులు చేయగా, 0.41 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని లభించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ బిల్లు – 2025 తో పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిధులు సమకూర్చడంలో రాష్ట్రాలకు కూడా భాగస్వామ్యం కల్పించడం మూలంగా బాధ్యత పెరుగుతుంది. ఉపాధి హామీ పథకం కింద గతంలో నైపుణ్యం లేని వారికి వంద శాతం కూలీలకు మొత్తం వేతనం కేంద్ర ప్రభుత్వమే చెల్లించేదని, నైపుణ్యం ఉన్న కూలీలకు కొద్ది మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది.
వీబీ జీ రామ్ జీ పథకంలో కేంద్రం వాటా 60 శాతం కాగా రాష్ట్రం వాటా 40 శాతం గా ఖరారు చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత ప్రాంతాలలో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్రాల వాటా 10 శాతం గా నిర్ణయించారు. ఉపాధి హామీ పథకం డిమాండ్ అనే పదాన్ని చేర్చారు. అర్హులైన కుటుంబం లేదా సభ్యుడు తనకు పని కావాలని డిమాండ్ చేస్తే పని దినాలు కల్పించి వేతనాలు చెల్లించాలని నిబంధన విధించారు. అయితే వీబీ జీ రామ్ జీ పథకం లో ఈ పదాన్ని చేర్చకపోవడం మూలంగా పని చేసేందుకు ముందుకు వచ్చేవారికి, డిమాండ్ చేసే వారికి 125 రోజుల పాటు పని లభించే అవకాశం లేదు. ఈ నిబంధన తొలగించడం పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలలో ఉపాధి లభిస్తుందా లేదా అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఒకవేళ అధికారులు పని చేసేందుకు ముందుకు వచ్చిన వారితో పనిచేయించుకుంటే ఆ మేరకు వేతనాలు చెల్లించేందుకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. లెక్కల ప్రకారం రికార్డు చేసుకునేందుకు ఇబ్బందులు తప్పవని క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామీణాభివృద్ధి సిబ్బంది వాపోతున్నారు.
Read Also |
Cold Wave | వామ్మో చలి పులి.. కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్టోగ్రతలు..!
Heartbreaking Viral Video | 54 ఏళ్ల ఎడబాటు తర్వాత భర్త మళ్లీ కనిపించినప్పుడు భార్య భావోద్వేగం..
