No FIR village | దశాబ్దాలుగా ఒక్క పోలీసు కేసు కూడా లేని గ్రామం మనదేశంలోనే ఉంది తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లోని షాహజహాన్‌పూర్ జిల్లా నియామత్​పూర్ గ్రామం 37 ఏళ్లుగా ఒక్క పోలీస్ కేసు కూడా లేకుండా రికార్డు స్థాపించింది. చిన్న గొడవైనా, పెద్ద వివాదమైనా, గ్రామ పెద్దలు కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటారు. శాంతిసఖ్యతలకు ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామం విశేషాలు.

Niyamatpur Village in UP: No FIR for 37 Years, A Model of Peace and Harmony

షాహజహాన్‌పూర్ (ఉ.ప్ర.):
No FIR village | ఇప్పుడున్న రోజుల్లో చిన్నచిన్న గొడవలు కూడా వెంటనే పోలీస్‌స్టేషన్‌ దాకా వెళ్తున్నాయి. పొలం సరిహద్దు వివాదం, కుటుంబ కలహం, ఆస్తి తగాదా, అతి చిన్న గొడవ కూడా పోలీసు కేసులుగా మారుతున్నాయి. కొన్నిసార్లు కాల్పులు, హింసాత్మక సంఘటనలకూ దారి తీస్తున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్‌లోని షాహజహాన్‌పూర్ జిల్లా, సిద్ధౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నియామత్​పూర్​  గ్రామం మాత్రం అందరికీ భిన్నంగా ఒక మోడల్‌గా నిలుస్తోంది.

ఈ గ్రామంలో గత 37 సంవత్సరాలుగా ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదు. ఎప్పుడైనా గొడవ తలెత్తినా, పోలీస్‌స్టేషన్ ముఖం చూడకముందే గ్రామ పెద్దలు, పంచాయతీ సభ్యులు, కుటుంబ పెద్దలు కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటారు.

నియామత్​పూర్​ : 1988లో మొదలైన సంప్రదాయం

గ్రామ సర్పంచ్ అభయ్‌యాదవ్ చెబుతున్న దాని ప్రకారం – “1988లో మా తండ్రి సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఈ సంప్రదాయం మొదలైంది. పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెడితే కుటుంబాలు విడిపోతాయి, సమాజం ముక్కలవుతుంది కాబట్టి ఏ గొడవ వచ్చినా అందరం కూర్చొని మాట్లాడుకుందాం” అని అప్పటినుంచే నిర్ణయించారు.

ప్రస్తుతం గ్రామ జనాభా దాదాపు 1400 మంది. ఈ పంచాయతీకి బిజ్లీఖేరా, నగరియా బహావ్ అనే రెండు తండాలు కూడా కలిసాయి. ఎవరైనా గొడవకు వస్తే మొదట పెద్దల దగ్గరికి వెళ్తారు. పెద్దలు కూర్చొని ఇరువైపుల వాదనలు విని, పరిష్కారం చెబుతారు. ఒకరికి ఒకరు సర్దుకుపోతారు. ఇది ఈ గ్రామంలో శాంతి, సఖ్యతను కాపాడిన ప్రధాన సూత్రం.

పోలీసులు వచ్చినా తిరిగి పంపించారు

గ్రామ పెద్ద మహీపాల్ ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ చెప్పారు: “ఒకసారి ఒక కుటుంబంలో బంధువుల మధ్య గొడవ వచ్చింది. ఎవరో 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులను పిలిచారు. పోలీసులు వచ్చి ‘మేం పరిష్కరిస్తాం’ అన్నారు. కానీ మేమే వారిని అడ్డుకుని ‘ఈ గొడవను మేమే సర్దుకుంటాం’ అని చెప్పి, పోలీసులను వెనక్కి పంపించాం. తర్వాత కూర్చొని గొడవను సర్దేశాం.”

ఈ ఒక ఉదాహరణ మాత్రమే. గత మూడు దశాబ్దాలుగా ఇలాగే ప్రతి గొడవ, వివాదం కోర్టులు, పోలీస్‌స్టేషన్​లకు వెళ్లకుండానే పరిష్కారం అయింది.

ప్రేమ, సఖ్యత.. అభివృద్ధిలోనూ ముందే

“మా గ్రామం శాంతి, ప్రేమ, సఖ్యతకు ఉదాహరణ. ఎప్పుడైనా వివాదం వస్తే మేమే కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటాం. పోలీస్ కేసు, కోర్టు అవసరం ఉండదు. మన మధ్య కలహాన్ని మనమే పరిష్కరించుకోవాలి” అని గ్రామస్థుడు సూరజ్‌సింగ్ చెప్పారు.

నియామత్​పూర్​  గ్రామం కేవలం శాంతి, సౌభ్రాతృత్వానికి మాత్రమే కాకుండా అభివృద్ధిలోనూ ముందుంది. గ్రామంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రాంతీయ రవాణా కార్యాలయం (ARTO) కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఇప్పుడు తనదైన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దేశానికి ఒక మోడల్

ప్రస్తుతం దేశంలో చిన్నచిన్న వివాదాలు పెద్ద కేసులుగా మారి, కోర్టుల్లో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండే పరిస్థితి. కానీ నియామత్​పూర్​  చూపిస్తున్న మార్గం వేరే. “పోలీసులు, కోర్టులకు వెళ్ళడం అంటే కుటుంబాలు చీలిపోవడం, బంధాలు తెగిపోవడం. కానీ మనలో మనమే మాట్లాడుకుంటే గొడవ ముగుస్తుంది. అంతేకాదు, బంధాలు కూడా బలపడతాయి.” అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.  ఈ సంప్రదాయాన్ని వాళ్ల పిల్లలు, మనవళ్లు కూడా కొనసాగించాలనీ, నియామత్​పూర్​  ఎల్లప్పుడూ శాంతి, సఖ్యతకు చిహ్నంగా నిలవాలంటూ వారు మనసారా కోరుకుంటున్నారు.

బాగుంది కదూ.. చదవడానికి కూడా ఎంతో హాయిగా ఉంది. ఇలా 37 సంవత్సరాలుగా ఒక్క FIR లేకుండా, పోలీస్ జోక్యం లేకుండా నడుస్తున్న నియామత్​పూర్​  గ్రామం దేశానికే ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తోంది.

Exit mobile version