Operation Sindoor Parliament | ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటులో చర్చ కొనసాగుతున్నది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చర్చను ప్రారంభించారు. భారత ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో 100 మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చామన్నారు. పహల్గామ్ లో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు చంపారని విమర్శించారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారన్నారు. ప్రతిగా ఆపరేషన్ సిందూర్ తో మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పాయని తెలిపారు. పీవోకే, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారు. మన సైనికులు ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారు. సిందూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సైన్యానికి అభినందనలు తెలిపారు. దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత అని…ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ మద్దతు ఉందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ అధికారులు పాల్గొన్నారు. దీనిని బట్టి వారిని ఆ దేశం ఎలా పెంచి పోషిస్తుందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్థాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని స్పష్టం చేశారు. పాక్ పై దాడి తర్వాత డీజీఎంవో కు సమాచారం ఇచ్చాం అని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం సత్తా చూపామని పేర్కొన్నారు. మనం చేసిన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. మన త్రివిధ దళాలను తట్టుకోలేక పాక్ డీజీఎంవో వెంటనే మనకు ఫోన్ చేశారు.
పాక్ దాడులు తిప్పి కొట్టాం
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యం మనపై దాడికి దిగిందని.. దాయాది పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం. మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌లోని మిసైల్ లాంఛింగ్ స్టేషన్ ధ్వంసమైంది. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసింది. భారత దాడులను అనేక దేశాలు సమర్థించాయి. సరిహద్దులు దాటి వెళ్లడం.. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే మా లక్ష్యం. యుద్ధం మా లక్ష్యం కాదు.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే మా విధానం. ఆపరేషన్ సిందూర్ లో మనదేశానికి ఎలాంటి ఆయుధ నష్టం జరుగలేదన్నారు. సైనిక బలగాల సామర్ధ్యాన్ని ప్రశ్నించడం విపక్షాలకు సరికాదన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నాం. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదన్నారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వినలేదు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి, ఆలోచించి ప్రశ్నలు అడగాలని విపక్షాలకు రాజ్ నాధ్ సింగ్ హితవు చెప్పారు. మాతృభూమి రక్షణలో మన సైనికుల వీరత్వం కనిపిస్తోందని..భుజ్, ఉధంపూర్ స్థావరాలకు వెళ్లి మన సైనికుల సత్తా ప్రత్యక్షంగా చూశానని వివరించారు.
ప్రతిపక్షాలు బాధ్యతతో మెలగాలి
యుద్దం వంటి అంశాలలో రాజకీయపరమైన విమర్శలు చేసే ముందు విపక్షాలు భాధ్యతతో వ్యవహరించాలని రాజ్ నాధ్ సింగ్ అన్నారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలని గుర్తు చేశారు. ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయని.. మన సైనికుల చర్యను వాజ్‌పేయీ ప్రశంసించారని గుర్తు చేశారు. 1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్‌పేయీ లాహోర్ యాత్ర చేపట్టారు. పాకిస్థాన్‌తో భారత్ స్నేహం కోరుకుంటోందని ఆనాడు వాజ్‌పేయీ చెప్పారు. స్నేహ హస్తం చాచడమే భారత్ గొప్పతనం. ఆనాడు వాజ్‌పేయీ తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదన్నారు. శాంతి కోరడం భారత్ రక్తంలోనే ఉంది. యుద్ధాలు కోరుకోం. ప్రతి విషయాన్ని మానవత్వ కోణంలో ఆలోచిస్తాం. తుపాకులు పేలితే ఎవరూ మిగలరన్నారు. ఇప్పటివరకు మనం ఎవరిపైనా దాడి చేయలేదు. పాకిస్థాన్ చరిత్ర, అక్కడి ఉగ్రవాదం గురించి తెలుసుకొని మాట్లాడాలి. మనిషి.. నీతి, నిజాయతీతో బతకాలని తులసీదాస్ దోహాలో చెప్పారు. భారత స్నేహహస్తాన్ని పాక్ అందుకోలేకపోయింది. మనదేశ ప్రజలను చంపుతుంటే సైన్యం చూస్తూ ఊరుకోదు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం.. ఆ దేశానికే ఇబ్బందిగా మారుతుంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.