Parliament adjourned । పార్లమెంటు ఉభయ సభలు బుధవారం వరకూ వాయిదా పడ్డాయి. అమెరికాలో అదానీ లంచాల కేసు, మణిపూర్, యూపీలోని సంభాల్‌లో హింస, వాయనాడ్ బాధితులకు సహాయం సహా వివిధ అంశాలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టి, నినాదాలు చేసిన నేపథ్యంలో సభలను వాయిదా వేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో మంగళవారం (26.11.2024) ప్రత్యేక ఉత్సవం నిర్వహించనున్నారు. దీనితో మంగళవారం సమావేశాలు లేవు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. తొలుత ఇటీవలి కాలంలో మరణించిన పార్లమెంటు సభ్యులకు సభ నివాళులర్పించింది. సాధారణ కార్యకలాపాల కోసం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే అమెరికాలో అదానీ లంచాల కేసు, మణిపూర్ అల్లర్లు, సంభాల్‌లో హింస, వాయనాడ్ బాధితులకు సహాయం తదితర కీలక అంశాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ సంధ్య రాయ్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది. ప్రతిపక్ష సభ్యులు 267వ నిబంధన కింద పలు కీలక అంశాలపై చర్చకు ఇచ్చిన మొత్తం 13 నోటీసులను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్ తిరస్కరించారు. దీనితో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. నోటీసులను ఆమోదించే ప్రసక్తే లేదన్న ధన్‌కర్.. తొలుత సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. అదానీ అంశంపై అత్యవసరంగా చర్చించాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఒక నోటీసు ఇచ్చారు. ఈ అంశం ప్రాముఖ్యాన్ని వివరించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ప్రపంచ స్థాయిలో భారత ప్రతిష్ఠ నాశనమైందని, అయినా ఇంకా అదానీకి ప్రధాని మోదీ మద్దతు పలుకుతున్నారని ఖర్గే విమర్శించారు. సభ ప్రొసీడింగ్స్‌ను పక్కనపెట్టి ఈ అంశంపై చర్చించేందుకు ధన్‌కర్ తిరస్కరించారు. ఖర్గే చెప్పిన మాటలు ఏవీ రికార్డుల్లోకి వెళ్లబోవని ప్రకటించారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ నినాదాలను కొనసాగించడంతో రాజ్యసభనకు బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ధన్‌కర్ ప్రకటించారు.
ఇదిలావుంటే పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ.. ప్రజల తిరస్కారాన్ని పొందినవారు పార్లమెంటును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సభా కార్యకలాపాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. గుప్పెడు మందిని ప్రజలు తగిన సమయంలో శిక్షించారని అన్నారు. పార్లమెంటులో ఆరోగ్యకర చర్చ జరగాలన్న మోదీ.. దురదృష్టవశాత్తూ తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పార్లమెంటును తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారికి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను కూడా వారు అర్థం చేసుకోవడం లేదని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకూ కొనసాగనున్నాయి.