మోదీకి ఎదురు తిరిగితే ఇదే గతి!

మోదీ వ్యాఖ్యలను ఖండిస్తే ఏమవుతుందో సొంత పార్టీకి చెందిన మైనార్టీ మోర్చా నేతకు తెలిసి వచ్చింది

  • Publish Date - April 28, 2024 / 07:41 PM IST
  • మోదీ వ్యాఖ్యలను ఖండించిన ఫలితం..
  • నాడు బీజేపీ నుంచి మైనార్టీ నేత సస్పెన్షన్‌
  • ఇప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు

జైపూర్‌: మోదీ వ్యాఖ్యలను ఖండిస్తే ఏమవుతుందో సొంత పార్టీకి చెందిన మైనార్టీ మోర్చా నేతకు తెలిసి వచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు గుంజుకుని చొరబాటుదారులకు పంచిపెడతారని మోదీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఉస్మాన్‌ ఘని ఖండించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఉదంతం అనంతరం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. తాజాగా శనివారం ఒక కేసులో ఆయనను ముందుస్తు అరెస్టు చేశారు. ముక్త ప్రసాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించినందుకు, వారితో గొడవకు దిగినందుకు ఘనీని ముందస్తు కస్టడీలోకి తీసుకున్నట్టు బికనీర్‌ పోలీసులు తెలిపారు.
‘ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు, బలమైన ప్రతిస్పందనలు రావడంతో కొద్ది రోజుల క్రితం ఘని క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు ఒక పోలీసు వాహనం ఆయన ఇంటికి వెళ్లింది. అది మామూలు ప్రక్రియే. మేం ఆయన ఎలా ఉన్నారో తెలుసుకునేందుకే వెళ్లాం. ఈ రోజు ఆయన ముక్త ప్రసాదధ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. తన ఇంటికి పోలీసు వాహనాన్ని ఎందుకు పంపారో చెప్పాలంటూ గొడవకు దిగారు. ఇది మామూలు ప్రక్రియేనని మేం ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. ఆ సమయంలో ఘని దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో గొడవకు దిగారు. ఆయన మళ్లీ ఇటువంటి గొడవకు దిగే అవకాశం ఉన్నందున మేం ఆయనను సీఆర్పీసీ 151 సెక్షన్‌ ప్రకారం అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది’ అని ముక్త ప్రసాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ధీరేంద్ర షెకావత్‌ మీడియాకు చెప్పారు.
మోదీ వ్యాఖ్యల అనంతరం న్యూస్‌ 24 అనే చానల్‌తో మాట్లాడిన ఘని.. బన్స్వారాలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వెళ్లిన సందర్భంగా బీజేపీ ముస్లిం సభ్యుడిగా ముస్లిం సమాజం తనను ప్రశ్నలు అడుతున్నదని చెప్పారు. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఘనిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు బికనీర్‌ సిటీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విజయ్‌ ఆచార్య ధృవీకరించారు.