న్యూఢిల్లీ : మహేంద్ర కంపెనీ ప్రతిష్టాత్మక వాహనం ‘థార్’ కారు(Thar Car)కు వాహనప్రియుల్లో ఉన్న క్రేజ్(craze) చెప్పనక్కరలేదు. ముఖ్యంగా లగ్జరీ, స్టేటస్ కోరుకునే వారు ఈ ఆఫ్ రోడ్ వెహికల్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అటువంటి వారికి థార్ వాహనం ఓ స్టేటస్ సింబల్(status symbol) గా మారింది. ఇదే క్రేజ్ ఇప్పుడు థార్ కారుకి ప్రతికూలంగా మారింది. హర్యానా డీజీపీ(Haryana DGP) ఓపీ సింగ్(OP Singh) ధార్ వాహన వినియోగదారులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాహనం ఎంపిక వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని, థార్ వాహనం నడిపే వ్యక్తులు దానిని ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారన్నారు. డబ్బు, పలుకుబడి ఉన్న వారు ఈ వాహనాన్ని వినియోగిస్తూ రోడ్లపై ఇష్టారాజ్యంగా, విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు.
పోలీసు తనిఖీల్లో థార్, బుల్లెట్ నడిపే వారిపై స్పెషల్ ఫోకస్
పోలీస్ తనిఖీ సమయాల్లో థార్, బుల్లెట్ బైక్ వంటి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నామని వ్యాఖ్యానించారు. మేము అన్ని వాహనాలను తనిఖీ చేయం..కానీ, బుల్లెట్ బైక్, థార్ అయితే మాత్రం అసలు వదలం అని స్పష్టం చేశారు. థార్ వాహనం అసలు కేవలం అది ఓ కారు కాదు.. స్టేటస్ సింబల్‌గా మారిపోయింది అని ఓపీ సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు థార్‌ను నడుపుతూ ఇటీవల ఓ ఏసీపీ కుమారుడు ఓ వ్యక్తిని ఢీకొట్టిన ఘటన గురించి ఈ సందర్భంగా డీజీపీ వివరించారు. తన కుమారుడిని రక్షించాలని సదరు అధికారి వేడుకున్నట్లు వెల్లడించారు. ఆ కారు ఏసీపీ పేరుమీదే ఉన్నట్లు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ అధికారి ఓ మోసగాడని సింగ్ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారుల్లో ఎవరెవరి దగ్గర థార్ వాహనాలున్నాయో లిస్ట్ తయారు చేస్తే ఎలా ఉంటుందని తనతో పాటు ఉన్న పోలీస్ అధికారులను సింగ్ ప్రశ్నించారు. ఎవరి దగ్గర అది ఉంటే వాళ్లు క్రేజీ అని వ్యాఖ్యానించారు.
ప్రమాదాల్లో థార్ వాహనాలతోనే అధికం
హర్యానాలో థార్ వాహనాలు వేగంగా నడపడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డీజీపీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో ఓ హైవేపై వేగంగా వచ్చిన థార్ డివైడర్‌ను ఢీకొంది. దీంతో అందులో ఉన్న ఆరుగురు వ్యక్తుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఓ పార్టీ నుంచి తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో డీజీపీ సింగ్ థార్ వాహన వినియోగదారుల అతిపై అసహనం వెళ్లగక్కారు.
