Priyanka Gandhi | వ‌య‌నాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..! ఈసారైనా బ‌రిలో దిగేనా..?

Priyanka Gandhi | దేశ రాజ‌కీయాల్లో మ‌రోసారి ప్రియాంక గాంధీ పేరు మార్మోగిపోతోంది. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమె ఎక్క‌డో ఒక చోట పోటీ చేస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ ఆమె ఎక్క‌డ్నుంచి కూడా పోటీ చేయ‌లేదు. కానీ ఇప్పుడు ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు స‌మ‌యం ఆసన్న‌మైన‌ట్లు తెలుస్తోంది. వ‌య‌నాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ వార్త‌ల్లో ఎంత మేర వాస్త‌వం ఉందో తేలాలంటే మ‌రో మూడు రోజులు వేచి చూడాల్సిందే.

  • Publish Date - June 14, 2024 / 09:21 AM IST

Priyanka Gandhi | దేశ రాజ‌కీయాల్లో మ‌రోసారి ప్రియాంక గాంధీ పేరు మార్మోగిపోతోంది. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమె ఎక్క‌డో ఒక చోట పోటీ చేస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ ఆమె ఎక్క‌డ్నుంచి కూడా పోటీ చేయ‌లేదు. కానీ ఇప్పుడు ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు స‌మ‌యం ఆసన్న‌మైన‌ట్లు తెలుస్తోంది. వ‌య‌నాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ వార్త‌ల్లో ఎంత మేర వాస్త‌వం ఉందో తేలాలంటే మ‌రో మూడు రోజులు వేచి చూడాల్సిందే.

ఎందుకంటే.. రాహుల్ గాంధీ ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌య‌నాడ్, రాయ్‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గెలుపొందారు. ఈ రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని రాహుల్ వ‌దులుకోవాలి. దీనికి ఇంకా మూడు రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది. ఏ నియోజ‌క‌వ‌ర్గం వదులుకుంటారో ఈ మూడు రోజుల్లోనే రాహుల్ నిర్ణ‌యించుకోవాల్సిన ప‌రిస్థితి. లేదంటే వ‌య‌నాడ్, రాయ్‌బ‌రేలీ రెండు స్థానాల‌ను రాహుల్ కోల్పోవాల్సి వ‌స్తుంది. దీంతో ఆయ‌న నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కొంది.

అయితే రాయ్‌బ‌రేలీ నుంచి రాహుల్ గాంధీ కొన‌సాగుతార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు పేర్కొంటున్నారు. జాతీయ రాజ‌కీయాల్లో యూపీకి ఉన్న ప్రాధాన్య‌త దృష్ట్యా.. రాహుల్ రాయ్‌బ‌రేలీ నుంచే లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌య‌నాడ్ నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నేది చ‌ర్చానీయాంశంగా మారింది. అయితే వ‌య‌నాడ్‌లో కాంగ్రెస్ శ్రేణులు ప్రియాంక గాంధీ అభ్య‌ర్థిత్వాన్ని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు త‌మ‌ను విడిచిపెట్టి వెళ్లొద్దు. ఒక వేళ మీరు నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దులుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటే ప్రియాంక గాంధీని వ‌య‌నాడ్ నుంచి పోటీ చేయించాల‌ని, జాగ్ర‌త్త‌గా చూసుకుంటామ‌ని బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు.

2019 నుంచి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ​లో క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ.. ఆమె ఇంకా ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. తానే సీఎం అభ్య‌ర్థిని కావొచ్చ‌ని ఆమె అన్నారు. త‌ర్వాత తాను నోరు జారిన‌ట్లు పేర్కొన్నారు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని కాంగ్రెస్​ శ్రేణులు కూడా భావించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని, తన మనసులో మాట కూడా బయటపెట్టారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. అంతేకాదు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వ‌హించిన రాయ్‌బ‌రేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తార‌ని చివ‌రి వ‌ర‌కు క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు. మ‌రి ఇప్పుడైనా వ‌య‌నాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారా..? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Latest News