Royal Families | న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజ కుటుంబీకుల వారసులు గెలుపొందారు. అఖండ విజయం సాధించిన రాజ కుటుంబీకులంతా బీజేపీ టికెట్‌పై గెలిచిన వారే. రాయల్ ఫ్యామిలీస్ నుంచి గెలుపొందిన వారిలో జ్యోతిరాధిత్య సింధియా, దుష్యంత్ సింగ్, మహిమ కుమారి మేవార్, యధువీర్ కృష్ణాదత్త, మాళవిక దేవీతో పాటు పలువురు ఉన్నారు.
జ్యోతిరాధిత్య సింధియా
జ్యోతిరాధిత్య సింధియా గ్వాలియర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. 2020లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో గుణ నియోజకవర్గం నుంచి 5 లక్షల ఓట్ల మెజార్టీతో సింధియా విజయం సాధించారు. బీజేపీ టికెట్‌పై ఆయన పోటీ చేయడం ఇదే తొలిసారి. గుణ నుంచి గతంలో ఆయన తండ్రి మాధవరావు సింధియా, నానమ్మ విజయరాజే సింధియా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
దుష్యంత్ సింగ్
దుష్యంత్ సింగ్.. రాజస్థాన్‌లోని ధోలాపూర్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. దుష్యంత్ సింగ్ గతంలో నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జలావర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన దుష్యంత్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిల జైన్‌పై 3.5 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మహిమ కుమారి మేవార్
రాజస్థాన్‌లోని మహారాణా ప్రతాప్ రాజ కుటుంబానికి చెందిన మహిమ కుమారి మేవార్.. రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. విశ్వరాజ్ సింగ్ మేవార్ భార్యనే మహిమ కుమారి. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ గుర్జార్‌పై 4 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మహిమ.
యధువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్
యధువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్.. ఈయన వయసు 31 ఏండ్లు. అమెరికాలో చదువుకున్నాడు. మైసూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. వడియార్ వంశానికి 27వ రాజుగా యధువీర్ పట్టాభిషేకం పొందారు. మైసూర్ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 1.3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మణ ఓడిపోయారు.
మాళవిక దేవీ
మాళవిక దేవీ.. మాజీ ఎంపీ అర్కా కేశరీ దియో భార్య. కలహండి రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ఈమె. కలహండిలో బీజేడీ అభ్యర్థి లంబోదర్ నియాల్‌పై లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీతో మాళవిక దేవి గెలుపొందారు.
కృతి సింగ్ దేబర్మ
కృతి సింగ్ దేబర్మ.. వీరిది త్రిపురకు చెందిన రాయల్ ఫ్యామిలీ. బీజేపీ మిత్రపక్షం తిప్ర మోత పార్టీ నుంచి కృతి సింగ్ పోటీ చేశారు. త్రిపుర ఈస్ట్ సీటు నుంచి 5.5 లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అభ్యర్థి రాజేంద్ర రియాంగ్‌పై గెలుపొందారు.
ఈ ఇద్దరు ఓటమి..
విక్రమాదిత్య సింగ్
విక్రమాదిత్య సింగ్.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ చేతిలో ఓడిపోయారు. విక్రమాదిత్య సింగ్‌ది రామ్‌పూర్ రాయల్ ఫ్యామిలీ. విక్రమాదిత్య తండ్రి వీర్‌భద్ర సింగ్.. హిమాచల్ ప్రదేశ్‌కు ఆరు సార్లు సీఎంగా సేవలందించారు.
రాజ్‌మాత అమృత రాయ్
రాజ్‌మాత అమృత రాయ్.. వెస్ట్ బెంగాల్‌లోని కృష్ణాన్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా 50 వేల మెజార్టీతో గెలిచారు. అమృత రాయ్.. మహారాజ కృష్ణచంద్ర రాయ్‌ను వివాహమాడారు. ఈమెను రాణి మా అని పిలుస్తారు.