హైకోర్టు తీర్పు తర్వాతే మా తీర్పు.. కేజ్రీవాల్‌కు సుప్రీంలో దక్కని ఊరట

మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బెయిల్ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఊరట దక్కలేదు

  • Publish Date - June 24, 2024 / 05:18 PM IST

విధాత, హైదరాబాద్: మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బెయిల్ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఊరట దక్కలేదు. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని.. అప్పటివరకు వేచి ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ ఆదేశాలు ఇస్తే అది ముందస్తు తీర్పు అవుతుందని అభిప్రాయపడింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు తిహార్‌ జైలులో ఉండాల్సివచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే అంశంపై హైకోర్టు మంగళవారం తీర్పునివ్వనుంది. మద్యం కుంభకోణం కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్పీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరీలు హాజరుకాగా.. ఈడీ తరపున ఆడిషినల్ సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు.

ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ చూడకముందే హైకోర్టు స్టే ఇవ్వగలిగినప్పుడు. మీరెందుకు హైకోర్టు ఆర్డరుపై స్టే విధించలేరు? అని కేజ్రీవాల్ తరుపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం ధర్మాసనం ముందు వాదించారు. అంతేకాకుండా హైకోర్టు అలా స్టే విధించడం ఉహించని విషయమన్నారు. కింది కోర్టులో తనకు అనుకూల తీర్పు వచ్చినప్పుడు ఎందుకు వేచి ఉండాలని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. హైకోర్టు నిర్ణయం కాస్త అసాధారణంగానే కనిపిస్తోందని.. అయినప్పటికీ ఒకవేళ హైకోర్టు తప్పిదం చేస్తే తాము దాన్ని పునరావృతం చేయాలా? అని పిటీషనర్ ను ప్రశ్నించింది. ఒకరోజు వేచిచూడడం వల్ల ఇబ్బంది ఏముందని, జూన్ 26న దీనిపై విచారణ చేపడతామని తెలిపింది

Latest News