Security Breach At Parliament | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు భవనం వద్ధ భద్రతా వైఫల్యం మరోసారి వెలుగుచూడటం సంచలనంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. శుక్రవారం ఉదయం 6:30 ప్రాంతంలో ఓ వ్యక్తి రైలు భవన్ వైపు నుంచి చెట్టు ఎక్కి..గోడ దూకి నూతన పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. అతను గరుడ గేటు వద్దకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఆగంతకుడిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా పేర్కొన్నారు. నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్ వాసి అని.. అతడి పేరు రామా అని అధికారులు వెల్లడించారు. 20 ఏళ్ల ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగాలేదని..అతని వద్ధ ఎలాంటి అనుమానస్పద వస్తువులు లేవని..అయితే అయితే అతడు ఏ ఉద్దేశంతో పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడ్డాడో తెలుసుకునేందుకు ఐబీ, ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం అతడిని ప్రశ్నిస్తోందని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. జూలై 21న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి.
కలవరం రేపిన ఘటన
పార్లమెంటులో ఆగంతకుడి చొరబాటు ఘటన కలకలం రేపింది. గత ఆగస్టులో కూడా ఇలాగే భద్రతా వ్యవస్థ కళ్ల గప్పి ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. 2023లో పార్లమెంటు శీతకాల సమావేశాల సందర్భంగా ఇద్దరు దుండగులు లోపలికి దూసకొచ్చి పొగ బాంబులతో హల్చల్ చేశారు. అంతకుముందు 22ఏళ్ల క్రితం 2001డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన ఘటన అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆ దాడిలో ఎనిమిది మంది భారత భద్రతా సిబ్బంది సహా ఓ తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయాలపాలవ్వడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో ఉభయసభలు వాయిదా పడినప్పటికీ.. దాదాపు 100 మంది ఎంపీలు, మంత్రులు పార్లమెంటు లోపలే ఉన్నారు.