Bihar Elections | రూ. 400 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగిన సెక్యూరిటీ గార్డు.. బీహార్ అసెంబ్లీకి పోటీ..!

Bihar Elections | సెక్యూరిటీ గార్డు( Security Guard ) నుంచి పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగిన ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వ్య‌క్తి బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో( Bihar Elections ) పోటీ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌శాంత్ కిశోర్( Prashanth Kishore ) స్థాపించిన జ‌న్ సురాజ్ పార్టీ( Jan Suraaj Party ) నుంచి పోటీ చేస్తున్న నీర‌జ్ సింగ్( Niraj Singh ) రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు.

Bihar Elections | సెక్యూరిటీ గార్డు( Security Guard ) నుంచి రూ. 400 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగాడు ఓ సాధార‌ణ వ్య‌క్తి. త‌న‌కే ఉద్యోగం దొర‌క‌ని స్థితి నుంచి ఎన్నో క‌ష్టాలు ప‌డి.. స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఇప్పుడు ఆయ‌నే ఓ 2 వేల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే స్థాయికి ఎదిగాడు. 38 ఏండ్ల వ‌య‌సులోనే రూ. 400 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగిన నీర‌జ్ సింగ్‌( Niraj Singh ).. ఇప్పుడు బీహార్ ఎన్నిక‌ల్లో( Bihar Elections ) హాట్ టాపిక్‌గా మారాడు. ఆయ‌న‌కు జ‌న్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party ) టికెట్ ఇచ్చింది. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో షియోహ‌ర్( Sheohar ) నియోజ‌క‌వ‌ర్గం నుంచి నీర‌జ్ సింగ్ పోటీ చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన నామినేష‌న్‌ను ఇవాళ దాఖ‌లు చేయ‌నున్నారు.

బీహార్ షియోహార్ జిల్లాలోని మ‌థురాపూర్ గ్రామంలో నీరజ్ సింగ్ జ‌న్మించాడు. ఆయ‌న‌ది ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. 13 ఏండ్ల వ‌య‌సులో ప‌ది పాస‌య్యాడు. కుటుంబ ఆదాయం స‌రిపోక‌పోవ‌డంతో తాను త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా నిల‌వాల‌నుకున్నాడు. కానీ ఆయ‌న‌కు ఎక్క‌డా కూడా ఉద్యోగం ల‌భించ‌లేదు. దీంతో స్థానికంగా పెట్రోల్, డీజిల్‌ను విక్ర‌యించ‌డం ప్రారంభించాడు. మూడేండ్ల త‌ర్వాత ఢిల్లీకి చేరుకుని సెక్యూరిటీ గార్డుగా చేరాడు. ఏడాది త‌ర్వాత‌.. పుణె వెళ్లి అక్క‌డ ఆఫీసు అటెండెంట్‌గా ఓ ప్ర‌యివేటు సంస్థ‌లో ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్ల‌కు అంటే 2010లో సొంతంగా ధాన్యం బిజినెస్ చేశాడు. ఇక అక్క‌డ్నుంచి ఆయ‌న‌కు తిరిగి వెనక్కి చూడ‌లేదు. ఎన్నో క‌ష్టాలు ప‌డి, స‌వాళ్ల‌ను అధిగ‌మించి.. బిజినెస్‌లో నిల‌దొక్కుకున్నాడు నీర‌జ్ సింగ్.

ఆ త‌ర్వాత ఉషా ఇండ‌స్ట్రీస్‌ను స్థాపించాడు నీర‌జ్ సింగ్. ఈ ప‌రిశ్ర‌మ ద్వారా ఇటుక‌లు, బిల్డింగ్ బ్లాక్స్, టైల్స్, సిరామిక్ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించాడు. అంత‌టితో ఆగ‌కుండా.. రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు త‌న వ్యాపారాన్ని విస్త‌రించాడు. ఇటీవ‌లే ఓ పెట్రోల్ బంక్‌ను తెరిచాడు. ఇలా ఎదుగుతూ ప్ర‌స్తుతం త‌న వ్యాపారాన్ని రూ. 400 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు తీసుకెళ్లాడు. ప్ర‌స్తుతం 2 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాడు.

నీరజ్ సింగ్ సైకిల్ కూడా కొన‌లేని ప‌రిస్థితి ఒక‌ప్పుడు. ఇత‌రుల సైకిల్ తీసుకొని త‌న ప‌నులు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు రేంజ్ రోవ‌ర్ కారుతో పాటు మ‌రో అర డ‌జ‌నుకు పైగా కార్లు నీర‌జ్ సింగ్ సొంతం. న్యాయ‌వాద ప‌ట్టా క‌లిగిన నీర‌జ్ సింగ్‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఇద్ద‌రు సోద‌రులు కూడా ఉన్నారు. నీర‌జ్ సింగ్.. తన నియోజ‌క‌వ‌ర్గంలో నిరుపేద కుటుంబాల్లోని ఆడ‌పిల్ల‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నాడు. వృద్ధుల‌కు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి.. వారి ఆరోగ్య ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు నీర‌జ్ సింగ్.