Site icon vidhaatha

currency notes । రాజ్యసభలో నోట్ల కట్ట.. విచారణకు ఆదేశించిన చైర్మన్‌ ధన్‌కర్‌

currency notes । రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వి సీటు కింద 500 రూపాయల నోట్ల కట్ట దొరకడం సంచలనం రేపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ శుక్రవారం ప్రకటించారు. అయితే.. సింఘ్వి మాత్రం సభలో ఉన్న సమయంలో తన వద్ద ఒక్క 500 రూపాయల నోటు మాత్రమే ఉన్నదని చెబుతున్నారు. శుక్రవారం సభనుద్దేశించి మాట్లాడిన చైర్మన్‌ ధన్‌కర్‌.. ‘గురువారం సభ వాయిదా పడిన అనంతరం రోటీన్‌గా విధ్వంస నిరోధక తనిఖీలు నిర్వహించారని, ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు తెలంగాణ నుంచి ఎన్నికైన అభిషేక్‌ మను సింఘ్వికి చెందిన సీటు నెంబర్‌ 222 కింద సెక్యూరిటీ అధికారులు 500 రూపాయల నోట్ల కట్టను కనుగొన్నారని సభ్యులకు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. ‘ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని చెప్పాను.. అది కొనసాగుతున్నది’ అని ధన్‌కర్‌ చెప్పారు.

అయితే.. దర్యాప్తు పూర్తికావడానికి ముందే సభ్యుడి పేరును ప్రస్తావించడంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘దర్యాప్తు పూర్తై, విషయాన్ని ధృవీకరించుకునేంత వరకూ సభ్యుడి పేరును ప్రస్తావించరాదని కోరుతున్నాను’ అన్నారు. మరోవైపు తాను ఒక్క 500 రూపాయల నోటును మాత్రమే కలిగి ఉన్నానని సింఘ్వి చెప్పారు. ‘ఇప్పుడే వింటున్నాను. నేను రాజ్యసభకు వెళ్లినప్పుడు ఒక 500 నోటును మాత్రమే తీసుకెళ్లాను. 12.57 గంటలకు నేను సభకు వచ్చాను. 1.30 వరకూ క్యాంటిన్‌లో కూర్చున్నాను. ఆ తర్వాత పార్లమెంటు నుంచి బయల్దేరాను’ అని సింఘ్వి ఏఎన్‌ఐ వార్తా సంస్థకు చెప్పారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ఇది తీవ్రమైన అంశమని అన్నారు. సభ ఔన్నత్యాన్ని ఇది దెబ్బతీసిందని చెప్పారు. ‘సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రొటీన్‌ ప్రొటోకాల్‌లో భాగంగా యాంటిసబటేజ్‌ టీమ్‌ సీట్లను తనిఖీ చేసింది. ఈ క్రమంలో నోటు దొరికింది. ఆ సీటు నంబర్‌ను, దానిలో కూర్చొన్న వ్యక్తి పేరు చెబితే తప్పేంటి?’ అని ఆయన అన్నారు. డిజిటల్‌ ఇండియా దిశగా భారతదేశం కదులుతుంటే.. సభకు కరెన్సీ నోట్లు తీసుకురావడం సరైందేనా? అని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version