Independent Candidates | 3,195 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థుల్లో.. గెలిచింది ఏడుగురే..! ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుసా..?

Independent Candidates | 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 3,195 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తే గెలిచింది మాత్రం ఏడుగురే. ఈ ఏడుగురిలో పంజాబ్ నుంచి ఇద్ద‌రు, బీహార్‌, మ‌హారాష్ట్ర‌, జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డ‌ఖ్‌, డామ‌న్ డ‌య్యూ నుంచి ఒక్కొక్క‌రు గెలిచారు.

  • Publish Date - June 5, 2024 / 10:13 PM IST

Independent Candidates | హైద‌రాబాద్ : 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 3,195 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తే గెలిచింది మాత్రం ఏడుగురే. ఈ ఏడుగురిలో పంజాబ్ నుంచి ఇద్ద‌రు, బీహార్‌, మ‌హారాష్ట్ర‌, జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డ‌ఖ్‌, డామ‌న్ డ‌య్యూ నుంచి ఒక్కొక్క‌రు గెలిచారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల్లో బారాముల్లా నుంచి గెలుపొందిన అబ్దుల్ ర‌షీద్ షేక్ అలియాస్ ఇంజినీర్ ర‌షీద్ అత్య‌ధికంగా 2 ల‌క్ష‌ల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఇంజినీర్ రషీద్ చేతిలో మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా ఓట‌మి చ‌విచూశారు. ఇక డ‌మ‌న్ డ‌య్యూ నుంచి గెలుపొందిన ప‌టేల్ ఉమేశ్ బాయ్ అత్య‌ల్పంగా 6,225 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఆ ఏడుగురు ఇండిపెండెంట్లు వీరే..

పూర్ణియా(బీహార్) – రాజేశ్ రాజ‌న్ అలియాస్ ప‌ప్పు యాద‌వ్(23,847 ఓట్ల మెజార్టీ)
సంగ్లీ(మ‌హారాష్ట్ర‌) – విశాల్ ప్ర‌కాశ్ బాపు పాటిల్(1,00,053 ఓట్ల మెజార్టీ)
ఖ‌దూర్ సాహీబ్(పంజాబ్) – అమృత్ పాల్ సింగ్(1,97,120 ఓట్ల మెజార్టీ)
ఫ‌రీద్ కోట్(పంజాబ్‌) – స‌ర‌బ్‌జిత్ సింగ్ ఖ‌ల్సా(70,053 ఓట్ల మెజార్టీ)
డామ‌న్ డ‌య్యూ – ప‌టేల్ ఉమేశ్ భాయ్ ( 6,225 ఓట్ల మెజార్టీ)
బారాముల్లా(జ‌మ్మూక‌శ్మీర్‌) – అబ్దుల్ ర‌షీద్ షేక్‌(2,04,142 ఓట్ల మెజార్టీ)
ల‌డ‌ఖ్ – మ‌హ్మ‌ద్ హ‌నీఫా(27,862 ఓట్ల మెజార్టీ)

2019 ఎన్నిక‌ల్లో న‌లుగురే విజ‌యం

2014లో కేవలం ముగ్గురు ఇండిపెండెంట్లు మాత్రమే గెలిచారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 3,443 మంది స్వ‌తంత్రులు పోటీ చేశారు. కానీ గెలిచింది మాత్రం న‌లుగురే. 2019లో మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నవనీత్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. డామన్ డయ్యూ నుండి స్వతంత్ర ఎంపీగా గెలిచిన‌ మోహన్ డెల్కర్ కన్నుమూశారు. అస్సాంలోని కోక్రాజార్ నుంచి నబ హీరా కుమార్ సర్నియా, కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి సుమన్ లతా అంబరీష్ స్వతంత్ర ఎంపీలుగా ఎన్నికయ్యారు.

1957లో అత్య‌ధికంగా 42 మంది ఇండిపెండెంట్లు గెలుపు

1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 1874 మంది పోటీ చేయ‌గా, అందులో 533 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. 360 మంది డిపాజిట్లు గ‌ల్లంత‌య్యాయి. 1957 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 1519 మంది అభ్యర్థుల్లో 481 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. 1962లో 20 మంది గెలిచారు. 1967 ఎన్నిక‌ల్లో 35 మంది విజ‌యం సాధించి పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టారు.

 

Latest News