Sunny Leone | స‌న్నీ లియోన్‌కు షాకిచ్చిన కేర‌ళ యూనివ‌ర్సిటీ వీసీ

బాలీవుడ్ భామ స‌న్నీ లియోన్‌కు కేర‌ళ యూనివ‌ర్సిటీ షాకిచ్చింది. కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలోని కార్య‌వ‌ట్టం యూనివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో వ‌చ్చే నెల 5వ తేదీన స‌న్నీలియోన్ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించాల‌ని ఓ స్టూడెంట్ యూనియ‌న్ భావించింది.

  • Publish Date - June 13, 2024 / 05:24 PM IST

తిరువ‌నంత‌పురం : బాలీవుడ్ భామ స‌న్నీ లియోన్‌కు కేర‌ళ యూనివ‌ర్సిటీ షాకిచ్చింది. కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలోని కార్య‌వ‌ట్టం యూనివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో వ‌చ్చే నెల 5వ తేదీన స‌న్నీలియోన్ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించాల‌ని ఓ స్టూడెంట్ యూనియ‌న్ భావించింది. అయితే ఈ కార్య‌క్ర‌మానికి యూనివ‌ర్సిటీ వీసీ డాక్ట‌ర్ మోహ‌న‌న్ కున్నుమ్మ‌ల్ అనుమ‌తి నిరాకరించారు. ఈ కార్య‌క్ర‌మం జాబితా నుంచి స‌న్నీలియోన్ పేరును తీసేయాల‌ని వ‌ర్సిటీ రిజిస్ట్రార్‌ను వీసీ ఆదేశించారు. క్యాంపస్‌ లోపల, బయట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిచేందుకు యూనియన్‌ను అనుమతించబోమని స్పష్టం చేశారు.

అయితే, గతేడాది కొచ్చిన్‌ యూనివర్సిటీలో చోటు చేసుకున్న విషాద ఘటనల నేపథ్యంలో వర్సిటీల్లో డీజే పార్టీలు, మ్యూజిక్‌ నైట్స్‌ వంటి కార్యక్రమాలపై కేర‌ళ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. 2023, న‌వంబ‌ర్‌లో కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీలో నిర్వహించిన మ్యూజిక్‌ కన్సర్ట్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

నాడు ఈ ఘటనను కేరళ హైకోర్ట్‌ తీవ్రంగా పరిగణించింది. నిర్వహణ వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించింది. ఈ మేరకు ఇలాంటి ఘటనలు వర్సిటీల్లో పునరావృతం కాకూడదని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్సిటీల్లో ఇలాంటి ఈవెంట్స్‌పై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ ఘటనల నేపథ్యంలోనే తాజాగా సన్నీ లియోన్‌ ఈవెంట్‌కు వీసీ అనుమతి నిరాకరించినట్లు స్టేట్‌ మీడియా స్ప‌ష్టం చేసింది.

Latest News