Site icon vidhaatha

0.001% శాతం నిర్లక్ష్యమైనా కఠినంగా వ్యవహరించాల్సిందేనన్న సుప్రీంకోర్టు .. నీట్‌లో అవకతవకలపై స్పందనలు తెలియజేయాలని .. కేంద్రం, ఎన్‌టీఏకు ఆదేశం

న్యూఢిల్లీ: ఎవరిపక్షానైనా 0.001శాతం నిర్లక్ష్యం ఉన్నా.. కఠినంగా వ్యవహరించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఏటీ)నుద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీట్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ పరీక్షల్లో అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ అన్ని అంశాలను విరోధులు వేసిన పిటిషన్లుగా భావించరాదని జస్టిస్‌ ఎస్‌వీ భట్టి పేర్కొన్నారు. ఈ ధర్మాసనానికి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ Justice Vikramnathనేతృత్వం వహిస్తున్నారు. కేంద్రం, ఎన్టీయే తరఫున హాజరైన అడ్వొకేట్‌ కాను అగర్వాల్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం అలా భావించడం లేదని వివరణ ఇచ్చారు. మోసాలకు పాల్పడి ఒక వ్యక్తి వైద్యుడైతే జరిగే పర్యవసానాలను జస్టిస్‌ భట్టి ప్రస్తావిస్తూ.. అటువంటి వైద్యుడు సమాజానికి మరింత హానికారకుడిగా ఉంటాడని అన్నారు. పరీక్షల సందర్భంలో విద్యార్థులు పడే శ్రమను, చేసే కృషిని కూడా కోర్టు ప్రస్తావించింది.

ప్రత్యేకించి పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో అభ్యర్థులు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటారో మనందరికీ తెలుసు’ అని భట్టి వ్యాఖ్యానించారు. కేంద్రం, ఎన్టీయే తమ స్పందనలను దాఖలు చేసేంత వరకూ ఒక అభిప్రాయానికి రావద్దని కాను అగర్వాల్‌ కోర్టును కోరారు. ‘మీరు కోర్టులోకి ప్రవేశించగానే మీ వైఖరి మారిపోకూడదు. పరీక్షలను నిర్వహించే బాధ్యత కలిగిన సంస్థకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు దృఢంగా నిలబడాలి. ఏదైనా తప్పు జరిగితే, అవును ఈ తప్పు జరిగింది, ఇది మేం తీసుకొనబోయే చర్య అని చెప్పాలి. మీ పనితీరుపై అది కనీసం విశ్వాసాన్ని కలిగిస్తుంది’ అని జస్టిస్‌ భట్టి చెప్పారు. ఇందుకు అంగీకరించిన అగర్వాల్‌.. అందుకే ఎన్టీయే గ్రేస్‌ మార్కుల విషయంలో నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. నీట్‌ పరీక్షల్లో 1563 మందికి ఇచ్చిన గ్రేస్‌మార్కులను రద్దు చేస్తున్నట్టు, తాజాగా పరీక్ష రాయాలనుకునేవారికి మరోసారి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు జూన్‌ 13న కేంద్ర ప్రభుత్వం, ఎన్టీయే సుప్రీంకోర్టుకు తెలిపాయి.

Exit mobile version