Site icon vidhaatha

Supreme Court | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై రేవంత్ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఊరట

Supreme Court | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆరెస్‌ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా.. ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇప్పుడు వారి నియామకానికి లైన్ క్లియర్ అయినట్లుగా భావిస్తున్నారు.

Exit mobile version