Supriya Sule | ముంబై : మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో ఉత్కంఠకు తెర పడింది. వదినను మరదలు చిత్తుగా ఓడించి, మరోసారి లోక్‌సభలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు సుప్రియా సూలే. ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించి నాలుగోసారి బరిలో నిలిచిన శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే.. తన వదిన సునేత్రా పవార్‌పై గెలుపొందారు.
ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన శరద్‌పవార్ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన భార్య సునేత్ర పవార్‌ను బారామతి నుంచి బరిలో దింపిన సంగతి తెలిసిందే. దీంతో వదిన, మరదలి మధ్య పోరుపై నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి సుప్రియా గెలుపుతో ఆ ఉత్కంఠకు తెరపడింది.
ఈ ఎన్నికల్లో సుప్రియా సూలే 3.37 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. సునేత్ర పవార్‌కు 2.93 లక్షల ఓట్లకు పైగా పోలయ్యాయి. కాగా, బారామతి లోక్‌సభ స్థానంలో ఐదు దశాబ్దాలుగా పవార్ కుటుంబం జెండా ఎగురవేస్తోంది. ఇక్కడ 1967, 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ బారామతి నుంచే గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి 1984, 1996,1998, 1999, 2004లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక గత మూడు దఫాలుగా సుప్రియా సూలే బారామతి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 నుంచి సుప్రియా సూలే వరుసగా ఈ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు.