న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీలో కరూర్ తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే చీఫ్ విజయ్ ఏడు గంటలు ఆలస్యంగా రావడమే ఘటనకు ప్రధాన కారణమని ఆరోపించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టీవీకే పార్టీ విఫలమైందని విమర్శించారు. ఈ ఘటనపై తాజాగా తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడు మొత్తాన్ని కలచివేసిందన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. టీవీకే షెడ్యూల్ తప్పిదాలే ఘటనకు కారణమన్నారు. ర్యాలీకి విజయ్ మధ్యాహ్నం వస్తారంటూ పార్టీ పేర్కొనగా.. ఆయన ఏడు గంటల తర్వాత వచ్చారని వెల్లడించారు. అప్పటికే పెద్ద ఎత్తున జనం గుమిగూడారన్నారు. ప్రచార వాహనం జనంలోకి వెళ్తుండగా.. గందరగోళం నెలకొనడంతో పాటు ఊపిరాడని కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుందన్నారు.
విజయ్ ఆలస్యమే తొక్కిలాటకు ముఖ్యకారణమన్నారు. ఈ క్రమంలో కొందరు జనరేటర్ ఉన్న గదిలోకి ప్రవేశించి దాన్ని నిలిపివేశారన్నారు. తాగునీటితో సహా సరైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో టీవీకే విఫలమైందని విమర్శించారు. క్షతగాత్రులకు సాయం చేసేందుకు అత్యవసర సేవల సిబ్బంది ప్రయత్నిస్తుండగా.. టీవీకే కార్యకర్తలు రెండు ఆంబులెన్స్‌లపై దాడి చేశారన్నారు. దాడులకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని స్టాలిన్ ప్రస్తావించారు. ఇక, స్టాలిన్ మాట్లాడుతుండగా.. ప్రచార ర్యాలీకి అసలు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి.